ఆధ్యాత్మికత, మతం ఒకటేనా?
- Srinivasa Malladi
- Feb 15, 2022
- 1 min read
ఆధ్యాత్మికత అంటే "కైవల్యం లేక మోక్షాన్ని పొందు దృఢ నిరంతర ప్రయత్నం".
విశ్వవ్యాప్తమైన పరమాత్మ మరియు నా శరీరంలో నన్ను చైతన్య పరుచు జీవాత్మ ఒకటే అని తెలుసుకోవడం. ఇదే సత్యం. ఇదే విద్య. ఆ బ్రహ్మజ్ఞానం పొందు నిత్య ప్రయత్నమే ఆధ్యాత్మికత. మహాసముద్రంలో నీరు పరమాత్మ అయితే ఒక నీటి బిందువు నేను, జీవాత్మను. సముద్రంలో నీరు, నీటి బిందువుల తత్త్వం ఒకటే.
ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు తెలుసుకుందాము.
ధర్మం అంటే "ఆధ్యాత్మిక స్థితిలో ప్రగతి చెందుటకు నిత్యం సహకరించు మార్గము".
స్వమతం అనగా ఆధ్యాత్మికతపై వ్యక్తిగత నమ్మకం. ఇందులో ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉన్నది. మతము అనగా మతి నుండి ఆవిర్భవించేది. మతి అనేది ఒక వ్యక్తికి సంభందించినది. ప్రతివ్యక్తి వేరేగా ఆలోచిస్తారు కాబట్టి వ్యక్తిగత అనుభవాలు తద్వారా వచ్చు అభిప్రాయాలు వేరేగా ఉంటాయి.
సామూహిక మతం (వ్యవస్తీకరించబడిన మతం) అనగా అందరు దైవం గురించి ఏకాభిప్రాయం పొంది తద్వారా అనుసరించడం. ఇది నిజానికి అసాధ్యం. ఎందుకంటే ఒకరి ఆధ్యాత్మిక అనుభావాలను శాసనంగా ప్రకటించి మిగిలినవారిని నమ్మమంటే వారు ఆ వ్యక్తి యొక్క అనుభవాన్ని నమ్ముతున్నారు గాని స్వానుభవాన్ని కాదు. ఇది ఆధునిక వ్యవస్తీకరించబడిన మతం తీరు. ఆధునిక మతం ఆధ్యాత్మిక స్వేచ్ఛ లేనిది. ఇందులో అందరి మార్గం ఒక్కటే అని చెప్పి అది నమ్ముకోకపోతే నిత్యనరకానికి పోతారు అని భయపెట్టి లేక ఈ మతం వదిలేస్తే మీపై పరిణామాలు ఉంటాయి అని బెదిరించడం గాని జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక స్వేచ్ఛకోల్పోవడం వలన బహుశా ప్రపంచంలో ఎన్నో తరాలకు చెందినవారు స్వానుభవం ద్వారా దైవాన్ని తెలుసుకునే అవకాశం కోల్పోయారు. నిజానికి మతం అనే మానవ మనోనిర్బంధం విశ్వాన్ని నడిపించు దైవానికి విరుద్ధంగా ప్రవర్తించి ద్రోహం చేస్తోందని చెప్పవచ్చు.
ఆధ్యాత్మికతను ప్రోత్సహించు ధర్మం ఆత్మవిద్యను భోదిస్తుంది. ఇది స్వయంగా పరిశోదించి తెలుసుకుంటే మోక్షమార్గంలో ప్రయాణిస్తారు మానవులు. ఆత్మవిద్య జీవాత్మలో నిగూఢమైన సహజ, అద్వీతీయ, నిత్య శక్తి. ఈ ఉన్నతమైన విద్య మనస్సు, ఇంద్రియముల ద్వారా సులభముగా గ్రహింపగలిగేది కాదు. ఈ శక్తి విశ్వమంతా వ్యాప్తిచెంది అతిసూక్ష్మముగా కూడా ఉన్న చైతన్యం. విద్య సత్యాన్ని భోదించేది. దీనికి భిన్నమైనది విరుద్ధమైనది అవిద్య. ఇది మనస్సు, ఇంద్రియాల ద్వారా గ్రహింపబడేది. బాహ్యంగా లభ్యమయ్యే ఈ అవిద్య తాత్కాలికమైనది. ఆత్మవిద్య నిత్యం మనతో ఉంటుంది.
రచన: Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి

Opmerkingen