ఆధ్యాత్మికత- విజ్ఞానముల విడతీయలేని సనాతన బంధం. ఇదే అసలైన విద్య.
- Srinivasa Malladi
- Feb 15, 2022
- 2 min read
ప్రపంచం జనాభాలో విజ్ఞానం మరియు నాస్తిక వాదం వలన సమాజంలో అత్యంత ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి అత్యధిక సంఖ్య మతమునుగాని ఆధ్యాత్మికతనుగాని అనుసరిస్తారు. 20వ శతాబ్దం నుంచి నాస్తిక వాదం అనుసరించువారి ప్రభావం విద్యావ్యవస్థ, దేశచరిత్ర, సమాచారమాధ్యమాలలో మరియు రాజకీయ పాలనవ్యవస్థలో అధికంగా ఉంది. ఈ ప్రభావాన్ని ఆర్థిక, రాజకీయ, సామాజిక బలం కలిగియున్న వ్యవస్తీకరించబడిన మతాలు (organized religions) ఎదురుకోగలుగుతున్నాయిగాని స్వమతం అనగా వ్యక్తిగత ఆధ్యాత్మిక అన్వేషణ చేయుటకు సహకరించు ధర్మములు ఎదురుకోలేకపోతున్నాయి. పాశ్చాత్య దేశాలు మతనిర్బంధనల వలన ఎన్నో శతాబ్దాలు వైజ్ఞానిక ప్రగతి సాధించలేదు. ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలలో వైజ్ఞానిక విప్లవం మొదలైందో అప్పుడు మతంవలన నిర్బంధనలు ఎదురుకున్న సమాజం ఒక్కసారిగా మానసిక స్వేచ్ఛతో ఊపిరిపీల్చుకుంది. అప్పటినుంచి విద్యావ్యవస్థలోగాని, పాలనవ్యవస్థలోగాని మతజోక్యం లేకుండా కాపాడుకుంటూ ప్రగతి చెందింది సమాజం.
దీనికి బిన్నమైనది భారతదేశం మరియు ఈశాన్య ఆసియాఖండం. ఎందుకంటే మతమనే శాశనం చోటుచేసుకోలేదు సరికదా ఆధ్యాత్మిక స్వేచ్ఛతో వేర్వేరు ధర్మసిద్ధాంతాలు కూడా ఉద్భవించాయి. కానీ, మతం అను నిర్బంధంలేని ఆధ్యాత్మిక స్వేచ్ఛ కలిగియున్న భారతదేశం మరియు ఇతర ఈశాన్య ఆసియాదేశాలు ఈ విప్లవంవలన నష్టపోయాయి. ధర్మం మార్గదర్శనంగా ఉందేగాని శాశనంగా ఎప్పుడు తమ ప్రజలను మానసికంగా ఉక్కిరిబిక్కిరి చేయలేదు. అంతేకాక చార్వాక సిద్ధాంతం వంటి నాస్తిక సిద్ధాంతం కూడా ప్రాచీన కాలంలోనే నిర్భయంగా స్వేచ్ఛగా చోటు సంపాదించుకుంది.
పులినిచూసి నక్కవాతపెట్టుకున్నట్లు పాశ్చాత్యదేశాలలో మతం-విజ్ఞానం మధ్య పోరుని చూసి ఆధ్యాత్మికస్వేఛ్చను కల్పించు ధర్మములను కూడా మతముగా భావించి లేక విజ్ఞానానికి వ్యతిరేకంగా భావించి విద్యావ్యవస్థనుంచి దూరం చేశారు. ఇది అవ్వడానికి ఒకేఒక కారణం - ఆధ్యాత్మికతను మతంతో ముడిపెట్టడం వలన. నిజానికి ఆధ్యాత్మికత, విజ్ఞానం ఒకటే. పరమహంస యోగానంద అన్నట్లు "దైవాన్ని తెలుసుకోడానకి అవసరమైన జ్ఞానమే విద్య. అది నిత్యము సత్యము. మిగిలినది అవిద్య, తాత్కాలికమైన జ్ఞానం". ఆధ్యాత్మికత అంతర్గతంగా చేసే సత్యాన్వేషణ, విజ్ఞానం బాహ్యంగా చేసే సత్యాన్వేషణ. రెండింటిలో తేడా, మనో-ఇంద్రియాలసాక్షం అనగా బాహ్యగ్రహణ పరిశోధన. ఆధ్యాత్మికత వలన ఎన్నో లాభాలు ఉన్నా కూడా బాహ్యగ్రహణ పరిశోధన ద్వారా నిరూపించుట సాధ్యంకాకపోవడంచేత విద్యావ్యవస్థలో, విజ్ఞానవ్యవస్థలో కనబడకుండా పోయింది.
అందువలన ప్రస్తుత ప్రపంచంలో ఒక నూతన సమస్య మొదలైంది. అమూల్యమైన అంతర్గత పరిశోధన చేయు విద్యను నేర్పించకపోవడంచేత ప్రస్తుత సమాజంలో ఉన్న బాలబాలికలు యువతీయువకులు ఆధ్యాత్మిక విలువలు తెలుసుకునే అవకాశం కోల్పోతున్నారు. దీనితో ఇంట్లో నాలుగుగోడల మధ్య వ్యక్తిగత ప్రపంచంలో ఏ వ్యక్తి అయితే తన ధర్మముగాని మతమగాని సర్వోత్తమమని పొగుడుతాడో అదే వ్యక్తి లౌకికవాదమును అనుసరించు బయటప్రపంచంలో తన సిద్ధాంతాన్నిగాని, ధర్మాన్ని గాని, స్వమతాన్నిగాని, సామూహికమతాన్నిగాని సమర్దించుటకు వైజ్ఞానిక దృష్ట్యా అర్హతకోల్పోతాడు. వైజ్ఞానిక దృక్పధం కోల్పోయి మిడిమిడిజ్ఞానంతో సామూహిక మతం, అనగా వ్యవస్తీకరించబడిన మతం (Organized Religion) బలపడుతుందేమో తప్ప ఆధ్యాత్మికతయే ముఖ్యమై ఆలోచనశక్తిని వికసింపజేయు స్వమతం అనగా ఆధ్యాత్మిక స్వేచ్ఛగల వ్యక్తిగత మతం ప్రగతి చెందదు.
ఇటువంటి ఆధ్యాత్మిక విద్యను అనగా ధ్యానం, యోగ, ప్రకృతితో కలిసిమెలసి జీవించుట, ధర్మసిద్ధాంతాలపై అవగాహన మరియు చర్చలు, వాదనలు వంటివి నేర్చుకునే అవకాశం విద్యావ్యవస్థ కల్పించాలి. వీటి ద్వారా వైజ్ఞానిక దృక్పధంతో ప్రశ్నించడం, చర్చించడం, ఆలోచించడం నేర్చుకుంటారు. మనోవికాసం, ఆధ్యాత్మిక చైతన్యం పొందడమే కాకుండా సమాజంలో లోకానికి ఉపయోగపడు విజ్ఞానం వికసిస్తుంది, బాధ్యతగల సమాజం ఏర్పడుతుంది.

రచన: Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి
Comentarios