top of page
Search

జీవితం అనే క్రీడపరిధిలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా?

రచన: Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి

జీవితం అనే క్రీడపరిధిలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా? .


మనం తొందరపడి చేసిన పనివలన గాని లేక నిర్ణయం తీసుకోలేక వదులుకున్న అవకాశం వలన గాని సంభవించిన వైఫల్యం మనకు భాద కలిగిస్తుంది. పరిశోధనానుసారం, అటువంటి చేదు అనుభవాలు ఎక్కువైతే డిప్రెషన్ , ఆందోళన , నిద్రలేమి వంటి మానసిక అనారోగ్యం కూడా రావచ్చు. ఈ వ్యాసంలో మనం మన మనస్సుకి శిక్షణ కల్పించి తద్వారా క్లిష్టమైన నిర్ణయాలను తీసుకోవడం ఎలాగో చూద్దాము. అలాగే అటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉండడం ఎందుకు అవసరమో కూడా తెలుసుకుందాము.


మొదటగా ఒక ఉదాహరణ - మనం రోడ్ పై వాహనంలో ప్రయాణించేటప్పుడు చాలా సార్లు మన ముందర దూసుకుపోయేవారిని చూస్తాం. మరికొన్ని సార్లు అతినమ్మదిగా నడిపి విసిగించేవారిని చూస్తాము. నిజానికి వాళ్ళతో ప్రయాణం చేయడానికి మనకు మనసొప్పదు. ఒకరితో ప్రయాణిస్తే ప్రాణభయం వస్తుంది. మరొకరితో ప్రయాణిస్తే "అసలు ఎప్పటికైనా ఇల్లు చేరుతామా అని" విసుగువస్తుంది. కానీ అదే ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తూ, సరైన వేగంతో మరియు సరైన సమయస్ఫూర్తితో నడిపేవారితో హాయిగా ప్రయాణం చెయ్యచ్చు. నిజానికి ఆ నైపుణ్యం వారి మనస్థితి యొక్క ప్రతిబింబం. అది చాలా మందికి అలవాటు చేసుకుంటే వస్తుంది. అటువంటి నైపుణ్యంగల డ్రైవర్ తనకు ఉన్న పరిధిఅంచులదాకా నియమాలను అనుసరించి ఆ నియమాలను అధిగమించకుండా అతిసులువుగా వాహనాన్ని నడిపి తప్పులుచేసే అవకాశాన్ని తగ్గించుకుంటాడు.


అలాగే మనం ఎన్నో సార్లు వ్యాపారస్తులు రిస్క్ తో కూడిన నిర్ణయాలు తీసుకోవడం గురించి వింటూ ఉంటాము. ఒకొక్కసారి స్తోమతకు మించి పెట్టుబడి పెట్టి నష్టపోవడం లేక సరైన సమాయానికి నిర్ణయంలో ఆలస్యం చేయడం వలన కలిగే నష్టం గురించి వింటూ ఉంటాము. ఆ రెండు పరిస్థితులు చాలా భాదకలిగిస్తాయి.


ఈ మధ్యనే రష్యాలో ఫిఫా ప్రపంచ ఫ్యూట్బాల్ ఛాంపియన్షిప్ అయింది. మీరు గమనించి ఉంటారు క్రీడాకారులు చాలా సార్లు ప్రత్యర్థి గోల్ లోకి సూటిగా బంతిని తన్నే బదులు బంతిని కావాలని ఫీల్డ్ అంచుదాకా తీసుకువెళ్లి అక్కడనుంచి గోల్ వైపు తన్నడానికి చూస్తారు. ఎందుకంటే గోల్ సాధించే అవకాశం బాగా పెరుగుతుంది. అంచుబయటకు పొతే ప్రత్యర్దికి బంతి ఇచ్చి విఫలమవుతారు. మరీ ఫీల్డ్ లోకి వచ్చి ఆడితే గోల్ సాధించే అవకాశాలు తక్కువచేసుకుంటారు. నిజానికి ఆ బంతి బయటకు పోకుండా అంచుదగ్గరే ఆడే నైపుణ్యం వారు ఎన్నోఏళ్ల శిక్షణ ద్వారా పొందుతారు.


మనం జీవితంలో తీసుకునే కష్టమైనా నిర్ణయాలలో ఇటువంటి శిక్షణ చాలా అవసరం. నేను ఇంగ్లాండ్లో మరియు సింగపూర్ లో నా ఎన్నో ఏళ్ల సైకియాట్రిక్ ప్రాక్టీస్ లో డిప్రెషన్, ఆందోళన , అడ్జస్ట్మెంట్ డిసార్డర్ , అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్ తో భాదపడినవారిని చూసాను వారికి చికిత్సనందించాను. వారిలో చాలా సార్లు వారు తీసుకున్న నిర్ణయం లేక తీసుకోకపోయిన నిర్ణయం వలన కుములిపోవడం చూస్తాము. అలా చింతించడం వలన వారికి దుఃఖం, ఆత్మవిస్వాసం క్షీణించడం, "నా నిర్ణయాలు ఎప్పుడు సరైనవి కావు" అని కృంగిపోవడం గమనిస్తాము. నిజానికి అటువంటి మానసిక అనారోగ్యం సంభవిస్తే సైకియాట్రిస్ట్ అందించు కౌన్సిలింగ్ ద్వారా , ఔషదాల ద్వారా వారి మానసిక ఇబ్బందులు నయమవుతాయి. కానీ మనం ముందుగా మన ఆలోచనా విధానాన్ని సరిచేసుకునే ప్రయత్నం చెయ్యాలి. చేసి తద్వారా క్లిష్టమైన నిర్ణయాలలో ఉన్న రిస్క్ మరియు అతిజాగ్రత్తలను సమతుల్యంగా విశ్లేషించాలి. అలా నిర్ణయం తీసుకుంటే నిర్ణయం సఫలమయ్యే అవకాశము పెరుగుతుంది. అలాగే ఒకవేళ నిర్ణయం విఫలమయినా తమ శక్తిమేరకు విశ్లేషించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కష్టమనిపించిన కుమిలిపోయే అవకాశం ఉండదు. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే మన మానసిక స్థితిని కాపాడుకున్నవారమవుతాము. అలాగే నేర్చుకున్న పాఠంతో జీవితంలో ముందరకు అడుగులేయడానికి వెనుకాడము.


ఇప్పుడు ఈ పద్దతికి అనుగుణంగా మరొక్క ఉదాహరణ చూద్దాము. ఈ పైన వివరించిన పద్దతిని అనుసరించే వ్యాపారి తన ఆర్థిక పరిస్థితిని చక్కగా విశ్లేషించి తాను ఒకవేళ పెట్టుబడి పెట్టినా లేక అప్పు చేసినా ఎంతవరకు ఇబ్బందుల్లో ఇరుక్కోకుండా ఉండగలడో అంతవరకే రిస్క్ తీసుకుంటాడు గాని మితిమీరడు.


ఇదిచేయాలంటే అతను ఈ నిర్ణయసోపానం అనుసరిస్తాడు. అది ఏమిటంటే-

1) తన వ్యక్తిత్వంలో గల బలాలు బలహీనతలు తెలుసుకుని

2) తను ఉన్న పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని

3) మంచిచెడులను విశ్లేషించి

4) నిర్ణయాన్ని తీసుకుని

5) ఆ నిర్ణయం యొక్క పరిణామమేమైనా దాని భాద్యత తనదేనని (తనది మాత్రమే గాని ఇంకెవరిదికాదని) ఆత్మవిశ్వసంతో కట్టుబడి ఉండడం .


ఈ సాధన ఒక వ్యక్తి స్వయంకృషితో లేక ఒక థెరపిస్ట్ సహాయంతో సాధించగలడు. ఒకసారి ఈ పద్దతిని నేర్చుకున్నాక ఈ పరిధి అంచులలో ఆడే క్రీడనియమాలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉండాలి. వైఫల్యం ఎన్నోసార్లు ఎదురుకొనవచ్చు కానీ క్రమేపి దీర్ఘకాలంలో ఎక్కువగా సాఫల్యం రుచి చూస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా మానసికంగా ఆనందం అనుభవిస్తారు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతారు. ఇటువంటి వ్యక్తి ఎంతటి కష్టకాలంలోనైనా తనని నమ్ముకుంటూ పరిధి అంచులలో రిస్క్ తీసుకొనే సాహసం చెయ్యగలడు. నా ప్రకరాం అటువంటి పరిస్థితులలో కూడా నిశ్చలంగా ఉండగలిగే వ్యక్తి శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో వర్ణించినట్లు స్థితప్రజ్ఞుడు. మీరేమంటారు?



 
 
 

Comentarios


Post: Blog2_Post

©2023 by Hindumitra. Proudly created with Wix.com

bottom of page