top of page
Search

దైవ సందేశ ప్రకటన, ఆచరణ మానవ కర్తవ్యం


బహుశా దైవ సందేశ ప్రకటన సనాతనమైన ఆచారం. నారద మహర్షి మనకు నిదర్శనం.

భగవద్ గీతలో కృష్ణ భగవానుడు దైవ సందేశాన్ని యోగ్యులకు ప్రకటించమని సూచించాడు.

ఆది శంకరుడు దైవ సందేశాన్ని ప్రకటించాడు.

దైవ సందేశం ప్రకటించుట మానవ కర్తవ్యం.


నిగమార్థప్రతిపాదకప్రకటమై; నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవతకల్పక్ష్మాజమై శాస్త్రరాజి గరిష్ఠంబగు నీ పురాణ కథ సంక్షేపంబునం జెప్పితిన్; జగతిన్ నీవు రచింపు దాని నతివిస్తారంబుగాఁబుత్రకా. శ్రీమహాభాగవతము

బ్రహ్మ నారదునితో ఇలా అన్నాడు. కుమార! నారద! ఈ భాగవతం అనే పురాణకథ వేదార్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమై వుంది. మోక్షప్రదంగా ఉండేటట్లు ఆ భగవంతుడు దీన్ని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం, శాస్త్రాలంన్నిటి కంటె శ్రేష్ఠమైనది. ఈ పురాణకథను నేను నీకు సంగ్రహంగా చెప్పాను. నీవు దీనిని లోకంలో విస్తృతంగా ప్రచారం కావించు.


య ఇమం పరమం గుహ్యం మద్భక్త్యేష్వభిధాస్యతి

భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః. భగవద్గీత.

నా యందు పరమభక్తి గలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును నా భక్తుల హృదయములలో పదిలపఱచువాడు నన్నే పొందును. ఇందే మాత్రమూ సందేహము లేదు. అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ.


ప్రకటించకపోతే అర్థమేమిటి ?

తిరస్కరించినట్లా?

పూర్తిగా నమ్మనట్లా?

తమోగుణంచేత బద్దకించినట్లా?

ఇది ధర్మాన్ని అనుసరించు అందరు ప్రశ్నించుకోవాలి. తిరస్కరించే స్వేచ్ఛ ఉంది. వారిని బెదిరించు వారు ఆధ్యాత్మికత అర్థంచేసుకోని మూర్ఖులు. సందేహం ఉంటె నమ్మకం కుదిరేవరకు ప్రశ్నించి తెలుసుకోవాలి గాని గోడమీదపిల్లిలా కూర్చోకూడదు. భగవద్గీత ప్రకరాం ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమైనది నిశ్చయాత్మకబుద్ధి. నేర్చుకున్నది భోదించడానికే గాని దాచుకోడానికి కాదు.


దైవ సందేశ ప్రచారం- మన కర్తవ్యం

అయితే మహర్షి నారదుడు, ఆదిశంకరుడు, వివేకానందుని వలే మరియు శ్రీకృష్ణుని ఉపదేశానుసారం మరి మనం నిత్యం ధర్మాన్ని అనుసరిస్తూ ప్రేమతో, సహృదయంతో దైవ సందేశ ప్రచారం చేసి ఆత్మస్వరూపులను ధర్మమార్గంలో నడిపించు కర్తవ్యాన్ని చేపడదామా?

ప్రేమ, సమదృష్టి, నిష్కామ కర్మ, తితీక్ష, ఆనందం,

సత్యవ్రతము, దయ, కరుణ, క్షమ, నిశ్చయబుద్ధి,

నిర్భయము,ఇంద్రియనిగ్రహణము, త్రికరణశుద్ధి

సమాధానము, స్వస్వరూప పరిజ్ఞానము

ఇలా ఆద్యంతరహితమైన, విశ్వవ్యాప్తమైన సనాతన ధర్మాన్ని త్రికరణశుద్ధితో సమదృష్టితో ప్రేమతో నిర్భయంగా పాటిస్తే ఆనందమైన మోక్షమార్గంలో మన ప్రయాణం నిశ్చయం.


లోకాః సమస్తాః సుఖినో భవంతు


రచన: Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి






 
 
 

Comments


Post: Blog2_Post

©2023 by Hindumitra. Proudly created with Wix.com

bottom of page