ప్రస్తుత కాలంలో తెలుగు భాషను సంరక్షించడానికి పాండిత్యం ఉండాలా , లేక తపన ఉంటె చాలా?
- Srinivasa Malladi
- Feb 15, 2022
- 3 min read
(2016లో ప్రపంచ తెలుగు సాహితి సదస్సులో ఉపన్యాసం - భాష , సంస్కృతి , సామాజిక స్పృహ -ఆత్మవిస్వాసానికి పునాదిరాళ్ళు. అవిలేకపోతే లీనింగ్ టవర్ అఫ్ పిసా అవుతాము. దూరమైతే వేర్లు లేని వృక్షాలవుతాము.) రచన: Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి
నా గురించి : నేను పవిత్రమైన తెలుగుభూమి పై పుట్టి 43 ఏళ్ళు గడిచాయి. చదివినది విశాఖపట్నం ఆంగ్ల పాఠశాలలో. పెరిగినది కళలను గౌరవించే కుటుంబములో. కానీ భారతీయ విద్యావిధానంలో లోపం వలన భాషకు దూరం అయిన వాళ్లలో బహుశా నేను కూడా ఒకడిని. భాషా ఉద్యమమే ధ్యేయంగా పెట్టుకుని నేను సింహపురంలో గత కొన్నేళ్లు గా సంస్కృతం, తెలుగు భాషాలను నేర్పించడమే కాక ఒక నూతన ఉత్సాహాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాను. నేను సాధారణ పామరుడను. పండితున్ని కాను.
ప్రస్తుత కాలంలో తెలుగు భాషాను సంరక్షించడానికి పాండిత్యం ఉండాలా , లేక తపన ఉంటె చాలా?
నేను చదివిన ఆంగ్ల పాఠశాలలో తెలుగును వ్యాకరణం లేకుండా బోధించారు. అదే చెప్తుంది నా తెలుగు పాండిత్యం గురించి. నేను మొదటిసారిగా సంస్కృతం నేర్చుకున్నది ఇంగ్లాండ్ దేశంలో. నా చదువులు పూర్తయ్యి "అమ్మయ్య! ఇప్పుడు నేను జీవితంలో చేద్దామనుకున్నవి మొదలుపెట్టచ్చు" అని అనుకుని అటువంటి గట్టి ప్రయత్నం చేసాను కాబట్టే ఇప్పుడు నాతొ పాటు నలుగురికి సంస్కృతం నేర్పుతున్నాను. సంస్కృతం నా పితృభాష అయితే మరి తెలుగు నా మాతృభాషే కదా! అందుకు గాను కొన్నేళ్లుగా మనబడిలో పిల్లలకు తెలుగు నేర్పాను. "భాషే సమంగా రాని వీడు ఇంకొకరికి నేర్పడమేమిటిట్రా" అని వ్యంగ్యంగా నవ్వుతున్నారా? నిజానికి ఉత్సాహమున్నపండితులే బోధించడానికి ముందుకు వస్తే నా వంటి వాడి అవసరముండేది కాదేమో? ఆలోచించండి.
తెలుగు వారికి బాష పై ఆసక్తి కలిగించడానికి నిజంగా తాతలు దిగివస్తారు. పిల్లలకు తెలుగు భాష నేర్పించవలసిన అవసరమేముందని కొందరు, "మాట్లాడుతున్నాము గా అది చాలు. వ్ర్రాయడం, చదవడం అవసరం లేదు." అని ఇంకొందరు అంటూ ఉంటారు. మొన్న ఈ మధ్య ఒక తెలుగు కార్యక్రమంలో మాట్లాడుతూ "మీలో ఎంతమంది తెలుగు మాట్లాడతారు" అని అడిగాను - అందరూ చేతులెత్తారు "మీలో ఎంత మంది తెలుగులో వ్రాస్తారు" అని అడిగాను - బహుశా 30% మంది చేతులు ఎత్తారు. అప్పుడు చివరగా నేను అడిగిన ప్రశ్న - "మీలో ఎంత మంది సంవత్సరంలో ఒక్కసారేనా తెలుగు పుస్తకం ఒకటి చదివారు?" - దానికి సమాధానంగా బహుశా 5% మంది చేతులు ఎత్తి ఉంటారు. సంవత్సరం లో ఒక్క పుస్తకం కూడా చదవని వారు ఇలా ఎంతో మంది తెలుగు రాష్ట్రాలలో కూడా ఉన్నారు. అంటే దాని అర్థం- తెలుగు రచయితలు ఎంత సాహిత్యం వ్రాసినా చదివే వాళ్ళు లేక పొతే సాహిత్య రచన క్రమేపి తగ్గిపోతుంది.
ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. నేను చెన్నైలో ఒక ఆశ్రమంలో ధ్యాన సత్సంఘానికి వెళ్లాను. అక్కడ ఉన్న పుస్తక విక్రయశాలకు వెళ్లి గురువుగారి చేత రచించబడే మాస పత్రికను తెలుగులోనే కావాలని అడిగాను. అప్ప్పుడు విక్రయశాలలో పని చేస్తున్నతెలుగావిడ "తెలుగులో ఎందుకు చదువుతారండి ఇంగ్లీష్ లో చదవండి ఇంకా బాగా అర్థమవుతుందని" అన్నారు. అప్పుడు నేనన్న మాట "ఇప్పుడు మీరన్నారని నేను ఇంగ్లీష్ లో తీసుకుంటాను - కొన్నాళ్ళకి తెలుగు మాస పత్రిక ఇవ్వమని అడిగితె ఏమంటారో తెలుసా " ఆబ్బె ఇప్పుడు తెలుగులో ఎవరు చదవట్లేదని తెలిసి ప్రచురణ నిలిపివేశామండి. ఇంగ్లీష్ లో చదవండి అని అంటారు" అని అన్నాను. ఇప్పుడు తెలుగు రాష్ష్ట్రాలలో తెలుగు బడులకు పట్టిన స్థితి కూడా ఇదే. గత కొన్ని దశాబ్దాలలో కష్టపడి, దూరదృష్టితో పిల్లలకు ఆకర్షణీయమైన, మరియు సంఘానికే ఉపయోగపడే రీతిలో పాఠ్యప్రణాళికను తయారు చేసి ఉంటె తెలుగు బడులను మూసి వేసే పరిస్థితి రాదు. పైగా ఎక్కువమంది పిల్లలు తెలుగు బడిలో చదవడానికి ఇష్టపడక మూసివేస్తున్నామని అంటున్నారు.
ఒక పాదరక్షల వ్యాపారి తన విక్రయ ప్రభంధకుని ఒక ద్వీపానికి పంపి అక్కడ వారి పాదరక్షల విక్రయణం మొదలుపెట్టడం గూర్చి పరిశోధన చేసి రమ్మన్నాడు. ఆ ప్రభంధకుడు వెళ్లి తిరిగి వచ్చి ఇలా అన్నాడు - "ఆ ద్వీపంలో ఎవరూ పాదరక్షలు ధరించరు. అందువలన మనం అమ్మినా ఎవరూ కొనరు" అని తెలిపాడు. మనసొప్పక ఆ వ్యాపారి ఇంకొక విక్రయ ప్రభంధకుని పంపాడు. అతను తిరిగొచ్చి "అక్కడ ఎవరూ పాదరక్షలు ధరించరు - అందువలన మనం శ్రమించి వారికి పాదరక్షల ఉపయోగం గూర్చి ప్రచారం చేస్తే మన పాదరక్షలు బ్రహ్మాండంగా విక్రయించవచ్చు" అని చెప్పాడు. ప్రయత్నం ఉన్నప్పుడే కదా ఫలితం దక్కుతుంది. కృష్ణ భగవానుడు చెప్పినట్లు ఫలితాన్ని ఆశించకుండా శ్రద్ధతో పని చెప్పట్టాలి. నేను తెలుగు విషయం లో పలు మార్లు గమనించాను. “ఏమో ఇది చేస్తే ఉపయోగముందో లేదో లేక పరువు పోతుందేమో” అని అనుకుని వెనకడుగు వేస్తారు. నిజమే విఫలమయ్యే అవకాశమెక్కువే కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆశయానికి తగ్గ ప్రయత్నం చాలా అవసరం.
దూరదృష్టి అంటే జ్ఞాపకం వచ్చింది. నేను వైద్యుడను. గ్రామప్రజలకు వైద్యసేవలు అందుబాటులో ఉండేటట్లు ఈ సంవత్సరం నేను విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో ఒక వైద్యకేంద్రాన్ని స్థాపించాను. నా ఊహ మీకు విచిత్రమనిపించవచ్చు కానీ పంచుకునే సాహసం చేస్తాను. వైద్యాన్ని అందించడమే కాక, పల్లె ప్రజలు వారి గ్రామాలలో నివసిస్తూ జీవనోపాధి పొందుతూ, దానితో పాటు వారి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ, భాషను దైనందిన జీవనానికి, మనోరంజనానికి, ఆధ్యాత్మిక చింతనకు ఉపయోగిస్తూ, కాలంతో పాటు కొట్టుకు పోకుండా నిలిచి ఉండేటట్లు నేను నా మనసులో నిర్మించుకున్న భావచిత్రం - రాబోవుకాలంలో ఫలిస్తుందని, దానిని ఆధారంగా తీసుకొని పలువురు వారి ప్రాంతాలలో శ్రమించి భాషను సంరక్షిస్తారని నా ఆశ.
సదస్సు కొరకు తెలుగు సాహిత్యంపై ఆసక్తి, అవగాహన పెంచే మరొక చిన్న ప్రయత్నం చేపట్టాము. దానికి గాను నెల క్రితం తెలుగువారం కొంత మంది ప్రతి ఒక్కరు చెరొక్క తెలుగు పుస్తకం శ్వీకరించి సదస్సు సమయానికి చదివి పూర్తి చెయ్యాలని ఒక దీక్షను శ్వీకరించాము. మరి మనందరం ఇంకొక దీక్ష శ్వీకరిద్దామా - ప్రతి సంవత్సరం కనీసం నాలుగు తెలుగు పుస్తకాలను చదివి పూర్తిచేద్దామని!
తెలుగు రాష్ట్రాల బయట నివసించు పిల్లల విషయానికి వస్తే పరిస్థితి ఇంకా శోచనీయంగా ఉంది. వారు వేర్లు లేని వృక్షాలుగా తయారయ్యే లోపు అందుబాటులో ఉన్న తెలుగు బడిలో చేర్చి , తెలుగు పాటలు , పద్యాలు నేర్పి, ఎదో ఒక కళను నేర్పించి భాషలో తియ్యదనాన్ని పరిచయం చేస్తే భావితరానికి మనం అమూల్యమైన సేవ చేసినవారమవుతాము. మరి ఆలోచించి ఆచరిద్దామా!
Comments