భారతీయులు "అతిథిదేవోభవ" అను ధర్మాన్ని సరిగ్గా అర్థంచేసుకున్నారా? - ఒక విశ్లేషణ
- Srinivasa Malladi
- Feb 15, 2022
- 2 min read
రచన: Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి

అతిథి అనగా "చెప్పకుండా వచ్చు వ్యక్తి" అని అర్థమని తెలుపబడింది. పైగా ఇబ్బంది అనిపించినా కూడా ఆ అతిథిని ఇల్లు వదిలి వెళ్ళమని అనకూడదు కాబట్టి ఆ వ్యక్తి ఎన్నాళైనా ఉండే అవకాశం ఉంది. నా చిన్నతనంలో కూడా మా ఇంట్లో ఈ ధర్మాన్ని పాటించడం చూసాను. అసలు మాతో పరిచయంలేని వ్యక్తికి అతని ఊరులో ఉండు మా బంధువు చెప్పారని మా ఇంటికి వచ్చి అతని పని అయ్యే వరకు బస చేశారు.
నిజానికి వసుధైవ కుటుంబకం అనే ధర్మానికి “అతిథిదేవోభవ” ముడిపడి ఉంది. అంతటి గొప్ప సంస్కారం గలది భారతీయ సంప్రదాయం. అతిథి మరియు ఆతిథ్యం ఇచ్చువారు ఈ ధర్మాలు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ పూర్వం భారతీయ భూమిపై పుట్టని వారికి ఆతిథ్యం ఇవ్వడంలో జాగ్రత్తలు తీసుకోలేదు అని చెప్పవచ్చు.
భారతీయులు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు విశ్లేషించవలసిన 10 సూత్రాలు. (అప్పట్లో, ఇప్పుడు కూడా):
1.వారు ఏ కారణానికి భారతదేశం వచ్చారు - శరణార్ధులా, వ్యాపారులా, పర్యాటకులా, చొరబాటుదారులా?
2. వారి ఆలోచన మరియు ఆచరణ విధానం ఏమిటి?
3. వారు ఆతిథ్యం పుచ్చుకొను అర్హులా కారా?
4. భవిష్యత్తులో ఏమి పరిణామాలు సంభవించవచ్చు?
5. ఆతిథ్యం ఇచ్చు నా (అప్పట్లో రాజు, ఇప్పుడు సామాన్య భారతీయుడు) వలన దేశభవిష్యత్తు మారవచ్చా?
6. వారి చరిత్ర ఎటువంటిది? క్రూరత్వం కలిగిన సంప్రదాయం నుంచి వచ్చారా? వారి మాటలో వంచన లేక మోసం ఉందా?
7. వసుధైవ కుటుంబకం అను ధర్మాన్ని అర్థంచేసుకోగలరా? లేక ఆధిపత్యం వ్యక్తపరచు లక్షణాలు ఉన్నాయా?
8. వీరు ఇక్కడ ఉండడానికి నాకు ఆశచూపిస్తున్నారా? చూపిస్తే ఎందుకు చూపుతున్నారు? అవకాశవాదులా?
9. వీరికి ఆతిథ్యం ఇవ్వడంలో నా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్నానా? అనగా నాకు ప్రాణ, ధన, ప్రజా నష్టం కలగదు కదా?
10. వీరికి ఆతిథ్యం ఇచ్చిన తరువాత నేను ఎటువంటి దుఃస్థితి ఉన్నా కూడా నేను నా స్వధర్మాన్ని వీడకుండా అనుసరిస్తానా?
స్వధర్మం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణభగవాన్ చక్కగా తెలిపారు.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 3.35 ।।
ఇతరుల ధర్మంలో ఎన్నో చక్కటి గుణాలున్నా, లోపాలు కలిగినా కూడా స్వధర్మమే గొప్పది. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం (ఇతర ధర్మాన్ని చేయటం) అనుసరించటం ప్రమాదకరమైనది.
ఉదాహరణ: రాజేష్ అనే వ్యక్తి ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. తల్లితండ్రులు ఎప్పుడూ గొడవపడతారు. తండ్రి తాగుడుకు బానిస. "ఛీ ఈ ఇంట్లో పుట్టడం నా దౌర్భాగ్యం" అనుకున్నాడు రాజేష్. అతని స్నేహితుడు చరణ్ ధనవంతుని ఇంట్లో పుట్టాడు. చరణ్ ఇల్లు స్వర్గం అని చెప్పవచ్చు. చరణ్ మరియు చరణ్ తల్లితండ్రులు రాజేష్ తో ఇలా అన్నారు "రాజేష్! మీ ఇల్లు వదిలేసి మా ఇంటికి వచ్చి ఉండిపో. మేము దత్తత తీసుకుంటాము". అప్పుడు రాజేష్ వెళ్లిపోతే స్వధర్మాన్ని వీడినవాడవుతాడు. స్వధర్మంలో ఉంటూ తన వంతు కృషి చేసి ఇంట్లో పరిస్థిని క్రమేపి మార్చే ప్రయత్నం చేయడమే తన ధర్మం.
బహుశా ఇవన్నీ చూడకుండా పూర్వం ఆతిథ్యాన్ని ఇచ్చేసారు మన పూర్వీకులు. ఆతిథ్యం అనే మంచితనాన్ని అవకాశంగా తీసుకుని భారతదేశంలో స్థిరపడి తరువాత అనేక విధ్వంసాలు సృష్టించారు విదేశీయులు. పోనీ అప్పుడు ఎదో జరిగిపోయింది. వారి పరిస్థితులు మనం చూడలేదుకాబట్టి తప్పుపట్టడం సరి కాదు. శతాబ్దాలు గడిచాయి. మతోన్మాదం వలన కోట్లమంది ప్రాణాలు కోల్పోయారు లేక అన్య మతం శ్వీకరించారు. దేవాలయాలను, విద్యాలయాలను నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారు.
కొన్ని వందల ఏళ్ల తరువాత స్వతంత్రం వచ్చింది దేశ విభజన అయ్యింది. అప్పుడు కూడా అతిథిదేవోభవ అను ధర్మాన్ని పాటించి స్వధర్మరాష్ట్రం కోరుకోలేదు సరికదా అన్ని మతాలకు ఈ భూమి పై స్వేచ్ఛ ఉందని మళ్ళీ మనమే మన విశ్వ ధర్మాన్ని గౌరవించి పాటించి ఆ ఉదారస్వభావం చూపించాము. పోనీ అప్పుడు ఎదో జరిగిపోయింది. వారి పరిస్థితులు మనం చూడలేదుకాబట్టి తప్పుపట్టడం సరి కాదు. దశాబ్దాలు గడిచాయి.
మరి ఇప్పుడూ అదే పరిస్థితి - ఆత్మగౌరవం నిర్లక్ష్యం చేసి సరిహద్దు ద్వారా చొరబడుతున్నవారిని ప్రోత్సహిస్తున్న వారు గాని, స్వధర్మాన్ని వీడి పరమతాన్ని శ్వీకరిస్తున్నవారు గాని, ఏ మాటంటే మీడియా గాని, లౌకికవాదులు గాని, విదేశీయులు గాని విరుచుకుపడిపోతారేమో అని ధైర్యం కోల్పోయి నోరువిప్పని వారు గాని, భాషలో ఏముంది , సంస్కృతీ లో ఏముంది అని స్వభాషను వీడి పరభాషను అవలంభిస్తున్నవారు గాని - వీరందరూ నిజానికి ఆ పరిచయం లేని అతిథిని ఆహ్వానించి వారికి క్రమేపి అధిక స్థానం కల్పించి పరధర్మమను వ్యామోహంతో ఆత్మగౌరవం మరియు స్వధర్మాన్ని వీడి భూమిని, భాషనీ, ధర్మాన్ని, సంస్కృతిని వదిలిపెట్టడానికి సిద్దపడి ఉన్నారు.
ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన ప్రశ్న మనం మనల్ని అడగాలి.
అతిథిదేవోభవ వలన collateral damage (తప్పని నష్టం) జరుగుతోంది అంటే అది ధర్మంలో లోపమా లేక అవగాహన ఆచరణలో లోపమా. ముమ్మాటికీ అవగాహనా ఆచరణలో లోపం. అది మనం ఎంత త్వరలో గ్రహించి ఆత్మగౌరవం యందు, స్వధర్మం యందు ఎటువంటి రాజి పడకుండా మన ధర్మాన్ని పాటిస్తామో అంతదాకా మనలను ఆ భగవంతుడు కూడా రక్షించడు, క్షమించడు.
Comments