భారతీయ శాస్త్రతత్వం ద్వారా ఆదర్శకుటుంబం నిర్మించడం ఎలా ? - మొదటి భాగం
- Srinivasa Malladi
- Feb 15, 2022
- 3 min read
భారతీయ శాస్త్రతత్వం ద్వారా ఆదర్శకుటుంబం నిర్మించడం ఎలా ? - మొదటి భాగం
(2017లో సింగపూర్ లో ప్రసంగం) రచన: Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి
నన్ను మీ మధ్య మాట్లాడడానికి ఆహ్వానంచినందుకు ధన్యుడను. భారతీయ తత్వవిచారం ద్వారా ఆదర్శకుటుంబాన్ని నిర్మించేది ఎలా? అంటే ఇందులో మూడు విషయాలు మనం గ్రహించాలి కుటుంబం, భారతీయ సాంప్రదాయ ఆలోచన విధానం , మానసిక స్వాస్థ్యము. ఇది కొంచం కష్టమైన పని. కానీ ముఖ్యమైన విషయమేమిటంటే నాకు ఆ మూడు అంశాలపై పరిశోధించి మీతో కొన్ని విషయాలు పంచుకొనే అదృష్టం దొరికినందుకు నేనే చాలా సంతోషిస్తున్నాను.
ఈ విషయం పై నా వ్యక్తిగత అభిప్రాయాలు , మరియు కించిత్ అధ్యయనం ద్వారా మరియు వృత్తిద్వారా కనుగొన్న విషయాలను కూడి మీ ముందు వివరిస్తాను.
వైదిక, పౌరాణిక, ఐతిహాస గ్రంథాలలో కొంతమందిని ఆదర్శంగా తీసుకోగలుగుతాము
1. శ్రావణ కుమారుడు - తల్లితండ్రుల పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చూపించిన ఒక మహోన్నత వ్యక్తి.
2. సావిత్రి - పవిత్రమైన మనస్సుతో, పట్టుదలతో, తెలివితేటలతో తన భర్తను కాపాడుకోవడానికి యముణ్ణి ఎంత నశపెట్టి సాధించింది.
3. రాముడు - తండ్రి మాట జవదాటలేదు
4. సీత -రాముడు రమ్మని అడగకపోయినా ఇష్టంగా భర్తని అనుసరించి వనవాసానికి వెళ్ళింది
5. భరతుడు - నా ప్రకారం - అత్యుత్తమ నిస్వార్థభావం చూపించిన వ్యక్తి . తన అన్నకి అయిన అన్యాయాన్ని అవకాశంగా తీసుకోలేదు సరికదా, వెతుక్కుంటూ వనానికి వెళ్లి అన్నని వెనక్కి రమ్మని బ్రతిమాలాడు, తిరిగి అయోధ్యకి వెళ్లి సింహాసనాన్ని అధిష్టించలేదు.
అయితే వీరందరూ సంకటంలో ఉన్నపుడు ఒకలాగే ఎలా ఆచరించగలిగారు?
అంతటి ధైర్యం, వివేకం వారికి ఎలావచ్చింది?
దానికి సమాధానం మీరు చెప్పగలరా ?
నా సమాధానం - ధర్మబద్ధమైన జీవశైలి
ధర్మం
అనగా మనం వ్యక్తిగతంగా , కుటుంబంలో , సమాజంలో ఎలా నడుచుకోవాలని సూచనలు, నియమాలు . ఇవివ్యక్తిగా మనం ఆచరిస్తే దాని ప్రభావం మనపైనే కాక కుటుంబం, సమాజం పై కూడా ఉంటుంది. నా అభిప్రాయం ఏమిటంటే వ్యక్తిగా మనోవికాసం పొందగలిగితే కుటుంబంలోనే కాక సమాజంలో కూడా ఆ వ్యక్తి మంచిమార్పు తేగలరు. నేను గమనించిన దాన్నిబట్టి చెప్పగలిగేది ధర్మాచరణకు ముఖ్యంగా అనుసరించవలసినది కర్మయోగము.
కర్మయోగము
భోగంతో కూడిన కర్మ మనలను బంధిస్తుంది.
యోగంతో కూడిన కర్మ మనకు విముక్తికలిగిస్తుంది
కర్మయోగము మన మనస్సులో జడత్వం మరియు ఆజ్ఞ్యానం అనబడు అంధకారాలను నిర్మూలిస్తుంది. మరియు మనం ఎదురుకొన్న వ్యక్తిగత సమస్యలను మనసునుంచి దూరంచేసి ఆ వ్యక్తిలో కరుణని ప్రసాదిస్తుంది .
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। కర్మణ్యేవాధికారస్తే మ ఫలేషు కదాచన !
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि! మ కర్మఫలహేతుర్భుహ్ మాతేసంగోస్త్వకర్మణి!
ఇది చాలా ఉత్తమమైన శ్లోకం - ఎందుకంటే మనందరికీ తెలిసినట్లు కేవలం కర్మనాచరించువరకే అధికారం అనగా హక్కు ఉంది కానీ ఫలితాన్ని ఆశించడంలో లేదు. అలాగే ఫలితాన్ని దృష్టిలోపెట్టుకుని కర్మనాచరించకూడదు మరియు నాకెందుకొచ్చింది నేను కర్మని అసలు ఆచరించే ఆచరించను అనడానికి కూడా వీలు లేదు. ఇక్కడ కర్మ అనగా మనము జీవితంలో చేయవలసిన పనులు, భాద్యతలు అని అర్థం. అప్పుడు మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండ మనకొరకు, పరులకొరకు, సమాజానికి , ప్రకృతికి ఉపయోగపడే రీతిలో పనిచేస్తాం. ఇలా ముఖ్యంగా అజ్ఞాతులకు చేయడం అలవాటు చేసుకుంటే లోతైన మానసిక గాయాలనుంచి ఉపశమనం పొందే అవకాశం కూడా కలదు.
పురుషార్థములు
ధర్మము మనకు సరైన మార్గము సూచిస్తుంది. తద్వారా మనమెవరము, మన వ్యక్తిత్వం ఏంటి అను అవగాహన ఏర్పడుతుంది. మన గత జీవితం ఎలా నడిచింది, వర్తమాన మరియు భవిష్యత్ జీవనం ఎలా నడిస్తే బాగుంటుంది అనే విశ్లేషణ చేయగలుగుతాము. ఇది చేయాలంటే ధర్మం తెలుసుకోవడానికి వీలయితే గురోపదేశం పొందాలి, మనలను తెలుసుకొనుట కొరకు ధ్యానం (రాజాయోగం ఒక మార్గము ) చేసి ఆత్మావలోకనం లేక ఆత్మాన్వేషణ చేయాలి.
ధర్మము- మన భాద్యతలు కేవలం మనకోసమే కాక మన కుటుంబం, సమాజం, దేశం, మానవాళి మరియు ప్రకృతి కొరకు కూడా అని చాటి చెప్తుంది. ధర్మం మన జీవిత లక్ష్యాలకు, దైనందిన ఆనందాలకు, మనం కోరుకునే స్వేచ్చా జీవనానికి పునాది కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ధర్మం నేను భౌతికకాయాన్ని కాను, ఈ జగత్తులో అత్యున్నతమైన పరమాత్మను అని గుర్తుచేస్తుంది. ఉదాహరణకు –
అర్థము -సంపద ఉత్పత్తి వైదిక ధర్మానికి వ్యతిరేకం కాదు. కానీ అన్నిటివలె ఆ సంపద దైవానికి చెందినది అందువలన సరైన మార్గంలో సంపాదించాలి, మనకోసమే కాక జనజీవనప్రకృతుల సంక్షేమం కొరకు వినియోగించాలి.
కామము - అనగా కోరిక. కోరికలు ఎలా ఉండాలంటే మన స్వభావాన్ని శోధించి తెలుసుకుని మనవ్యక్తిత్వానికి తగ్గ పనులను చేసి సంతృప్తి చెంది, ఆనందం పొందడం. అనగా మనం సహజం గా ఉండాలి. నటించకూడదు. పరులను సంతృప్తిపరిచే నైపథ్యంలో మనవ్యక్తిత్వానికి భిన్నంగా ఏమి చేసినా దుఃఖద్వేషక్రోధములకు దారితీస్తుంది. అందుచేత దయచేసి నటించవద్దు. అలాగే కర్మేంద్రియాల వ్యసనాలకు లొంగిపోయే వ్యర్థపనులుకాక ఉదాహరణకు మొబైల్ ఫోన్ వ్యసనం, టీవీ సీరియల్ వ్యసనం వంటివి కాక , మనోవికాసం, మన:శుద్ధి , మన: శాంతి కొరకు కామాన్ని కేంద్రీకరించాలి. ధ్యానం ఆవశ్యకం. స్వాధ్యాయం ఆవశ్యకం. కర్మయోగం ఆవశ్యకం. ఇంద్రియపూజాం త్యజతు. పరమాత్మ పూజాం కరోతు. ఇలా చేస్తే మన జీవితం లో వచ్చే మంచి మార్పులు మోక్షంతో సమానం. మనస్సుని నిర్మలం చేయడమే ధ్యేయంగా భావించడంతో ప్రాకృతికకళల ఆరాధన, ఆధ్యాత్మిక చింతన, మానవతాభావం, ప్రకృతిసౌందర్యపోషణం వంటి అత్యుత్తమ రుచులను ఆస్వాదిస్తాము.
బాగానే ఉంది కానీ ధర్మార్థకామమోక్షాలను పాటించేది ఎలా. దీనికి అష్టాంగయోగము అవసరము. యోగములో అష్టాంగములు - యమ , నియమ , ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధి.
యమ అనగా సమాజంలో ఎలా వ్యవహరించాలి,
నియమ అనగా వ్యక్తిగతంగా పాఠించవలసిన నియమాలు
ఆసన - అంటే సుఖంగా ఒక భంగిమలో ఉండడం
ప్రాణాయామ- శ్వాసను క్రమబద్దం చేయడం
ప్రత్యాహార- మనో-ఇంద్రియాలను నియంత్రించడం
ధారణ- నియంత్రించిన తరువాత మన మనస్సును ఒక విషయంపై కేంద్రీకరించడం
ధ్యానం- కేంద్రీకరించి కొంతకాలం ఆ స్థితిలో ఉండడం
సమాధి- ఆ స్థితిలో లీనపైపోవడం
యమ, నియమల ద్వారా వ్యక్తిగా, సమాజంలో ధర్మబద్ధమైన జీవనవిధానాన్ని అలవాటు చేసుకుంటాము. తరువాత క్రమశిక్షణతో కూడి ఆసన, ప్రాణాయామముతో శరీరాన్ని దృడంగా మలచుకొని, ప్రత్యాహారతో మనసుని, ఇంద్రియాలను అదుపులో తీసుకువస్తాము. ఆపైన ధారణ, ధ్యానములతో ఆత్మావలోకనం, ఆత్మపరిశోధన చేసి మన గురించి తెలుసుకుని ఆధ్యాత్మిక భావాన్ని, వ్యక్తిత్వాన్ని మన జీవనవిధానాన్ని మలచుకోవచ్చు.
పురుషార్ధాలను చూసాము కాబట్టి ఇప్పుడు ఆశ్రమధర్మము చూద్దాము. బ్రహ్మచర్య, గృహస్థ , వానప్రస్థ, సన్యాసం ఆ నాలుగు ఆశ్రమాలు మనకు తెలిసినవే. ఇందులో ఇవాళ్టికి సంబంధించి గృహస్థాశ్రమం గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. ఈ దశ వ్యక్తి యొక్క వివాహ జీవితాన్ని సూచిస్తుంది. గృహాన్ని నిర్వహించడం, కుటుంబాన్ని పెంచడం, పిల్లలను చదివించడం మరియు కుటుంబ సంబంధిత ధార్మిక సామాజిక జీవనాన్ని ఆచరించడం. అన్ని దశలలోకల్లా గృహస్థాశ్రమం అత్యంత ముఖ్యమైనదని పరిగణించబడింది. దంపతులు ఈ దశలో ధనార్జన, ఉద్యోగబాధ్యతలు, కుటుంబశ్రేయస్సే ధ్యేయంగా భావించి భార్యాభర్తలు మిత్రులవలె కష్టసుఖాలను పంచుకొని దాంపత్యాన్ని గడపడం. దైనందిన అవసరాలు చూసుకుంటూ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించిన తరువాత మిగిలిన సమయంలో మాత్రమే స్వార్ధ ఇష్టాలను అనుసరించాలి. అలాగే గృహస్థుడయ్యాకా బ్రహ్మచర్యంలో అనుసరించిన ఆకతాయి పనులను మానుకొని మసలుకోవాలి.
దీనికి అనుగుణంగా పెళ్లి మంత్రాలు కొన్ని చూద్దాము
" పురుషార్థాలను సాధించుటలో ఈమెను అతిక్రమించి ప్రవర్తించను" అని కన్యదాత వరునితో అంటాడు. దానికి బదులుగా " నాతి చరామి- అతిక్రమించను " అని మాటిస్తాడు వరుడు.
అలాగే సప్తపదులలో - ఓ భార్య ! మనం స్నేహితులుగా ఉందాము. నేను నీ స్నేహంనుంచి ఎప్పుడు విడిపోను. మనం కలసి తిందాం , కలసి ఆలోచిద్దాం , కలసి నిర్ణయిద్దాం , కలసి నడుచుకుందాం , బాహ్యేంద్రియాల విషయంలో కూడా కలసి ఉండేటట్లు నడుచుకుందాము. అని అంటాడు వరుడు.
దానికి భార్య అలాగే చేద్దాం అంటుంది గాని. అలాగే నీ సంగతి చూద్దాం అనదు.
ఇక్కడ అంతరార్ధము చూస్తే ఎవరైతే ధర్మాన్ని నమ్ముకుని జీవితాన్ని అనుసరిస్తారో వారు ఈ పెళ్లి ప్రమాణాలను తూచాతప్పకుండా పాటిస్తారు. వారికి దాంపత్యజీవితంలో సంతృప్తి ఉంటుంది. అలాగే పిల్లలను ఆనందంగా పెంచిపెద్దచేయగలుగుతారు. కష్టనష్టాలున్నా కలసి ఎదురుకుంటారు.
మొదటి భాగం ముగింపు
Comments