భారతీయ శాస్త్రతత్వం ద్వారా ఆదర్శకుటుంబం నిర్మించడం ఎలా ? - రెండవ భాగం
- Srinivasa Malladi
- Feb 15, 2022
- 3 min read
రచన: Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి
మన కుటుంబం సర్వస్వము - కుటుంబ శ్రేయస్సులో నా శ్రేయస్సు ఉంది
श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् | శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మోత్స్వనుష్ఠితాత్ !
स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: ! స్వధర్మో నిధనం శ్రేయహ్ పరధర్మో భయావహః
ఈ శ్లోకం మన జీవితంలో ఎన్నో సందర్భాలలో ఉపయోగించుకోవచ్చు. కుటుంబానికి సంభందించి నేను ఈ ఉదాహరణ చెప్తాను. మనమున్న కుటుంబంలో అల్లకల్లోలం ఉందనుకుందాం. మన స్నేహితుని ఇల్లు స్వర్గంలా ఉందనుకుందాం. అయినంతమాత్రాన్న నేను నా కుటుంబాన్ని విడిచి స్నేహితుని కుటుంబంలో కలసిపోతాను అనుకోవడం ధర్మం కాదు. నిజానికి మన ధర్మాన్ని అనుసరించి మన కుటుంబంలో మార్పును తీసుకువచ్చే ప్రయత్నం చేసుకోవాలి గాని పారిపోకూడదు. ఇంకొక ఉదాహరణ - పెళ్లి అయినా తరువాత పుట్టింటికన్నా అత్తవారింట్లో డబ్బు, హోదా ఎక్కువగా ఉందని కొన్ని సందర్భాలలో కొడుకు గాని, కూతురు గాని తల్లితండ్రులను ఇదివరకట్లా గౌరవించకపోవచ్చు. అట్లా చేస్తే "పర" అనే మోజులో "మన" అను వారిని విస్మరించినవాళ్ళము అవుతాము. ఇలా ఒక దేశం కావచ్చు. చాలా మంది భారతదేశాన్ని వదిలి వెళ్లి పై దేశంలో స్థిరపడడానికి కారణం అక్కడ జీవన విధానం గాని అక్కడ వ్యవస్థ గాని మనకు అనుకూలంగా ఉండుటచేత. అయినంతమాత్రాన్న భారతదేశ ప్రగతి గురించి ఆలోచించి ధనసహాయం ద్వారా, నైపుణ్యం ద్వారా, లేక కనీసం తరచూ వచ్చి వెళ్లడమో చేస్తే మన ధర్మాన్ని నిర్వర్తించినవారం అవుతాము.
సత్సంగం యొక్క ప్రాముఖ్యత
మనం అలవాటుచేసుకొనే మంచిగుణాలకు, ఆధ్యాత్మిక ప్రగతికి సత్సంగం ఎంత అవసరమో మన కుటుంబానికి కూడా అంతే అవసరం. ముఖ్యంగా పిల్లలకు. సాధారణంగా మనం సత్సంగమంటే ధ్యానసమూహంగా పరిగణిస్తాము. ఇది ఎందుకంటే సహజంగా వారు దైవచింతనతో ఒకచోట చేరుతారు కాబట్టి. అలాగే సత్సంగం అంటే ధర్మానుసారం ఆలోచించేవారితో కలవడం కూడా అనుకోవచ్చు. లేదా కనీసం కొంతమందితో హాయిగా మనసు విప్పి నిర్భయంగా కష్టసుఖాలను పంచుకోగలము అన్నవారితో కలవడం కూడా సత్సంగమే . వీలయితే వీరు వృధా సంభాషణలు, టీవీ సీరియళ్లు , ఊరికే తోచక కలవడాలు. కలిసాం కదా అని రాజకీయాలు, సినిమాలు మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం , పిల్లల్ని పోల్చడం, హోదాలను పోల్చుకోవడం వంటి అర్థరహిత కార్యకలాపాలతో సమయాన్ని వృధా చేయకూడదని వారు గ్రహిస్తారు. ఒకే కుటుంబంలో కూడా భిన్న అభిరుచులు , ఆలోచనా విధానాలు కలవారు ఉంటారు. వారితో సత్సాంగత్యం కుదరకపోవచ్చు. ఒకే కులం వారు అయినంతమాత్రాన , ఒకే భాష మాట్లాడినంత మాత్రాన అటువంటివారితో సత్సాంగత్యం కుదరకపోవచ్చు. కొంతవరకు వ్యత్యాసం ఉన్నవారితో సద్దుకుపోవడం నేర్చుకోవాలి కానీ అదేపనిగా మీ అభిప్రాయాలను, మీ కుటుంబాన్ని , మీ నమ్మకాలను కించపరుచువారి నుంచి దూరంగా ఉండండి. అవకాశవాదులనుంచి, వెనక గోతులు తవ్వేవారినుండి దూరంగా ఉండండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ కుటుంబంలో ఎవరు తప్పుచేసిన వారిని మందలించండి కానీ ఆదుకోండి. ముఖ్యంగా మీలో ఎవరు తప్పులు చేస్తారా పుండుపై కారం జల్లుదాం అని కాపలా కాసే వారి నుండి మీ కుటుంబాన్ని కాపాడండి.
అందుకే సత్సంగం అవసరం.
స్నేహం - మంచి / చెడు
అలాగే మీరు ఎవరితో స్నేహం చేస్తారో ఆ ప్రభావం కుటుంబంపైన పడుతుంది. కాబట్టి స్నేహితుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా సార్లు అక్కర్లేని గొడవలు మనస్తాపాలు స్నేహం వలన స్నేహితులవలన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.
न विश्वसेत्कुमित्रे च मित्रे चापि न विश्वसेत्। న విశ్వసేత్ కుమిత్రే చ మిత్రే చాపి న విశ్వసేత్!
कदाचित्कुपितं मित्रं सर्वं गुह्यं प्रकाशयेत् ॥ కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యామ్ ప్రకాశయేత్
చెడ్డవారిగ పరిగణింపబడే మిత్రునితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎప్పుడో కోపంలో ఉన్నప్పుడు మీ రహస్యాలన్నీ బయటపెట్టే మిత్రునితో కూడా జాగ్రత్తగా ఉండాలి.
परोक्षे कार्यहन्तारं प्रत्यक्षे प्रियवादिनम् ! పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం!
वर्जयेत्तादृशं मित्रं विषकुम्भं पयोमुखम् ! వర్జయేత్ తాదృశం మిత్రం విషకుంభం పయోముఖమ్!
మీ వెనక గోతులుతవ్వి మీ ముందర ప్రియవచనాలు పలుకువారు పయోముఖ విషకుంభం వంటివారు. దయచేసి వారికి దూరంగా ఉండండి.
కానీ ఎటువంటి మిత్రుడు అసలైన మిత్రుడు లేక బంధువు
पापान् निवारयति योजयते हिताय! పాపాన్ నివారయతి యోజయతే హితాయ!
गुह्यं निगुहति गुणान् प्रकटीकरोति । గుహ్యం నిగుహ్యతి గుణాన్ ప్రకటీకరోతి !
आपद्गतं च न जहाति ददाति काले! ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే!
सन्मित्रलक्षणमिदं निगदन्ति सन्तः ॥ సన్మిత్రలక్షణమిదం నిగదన్తి సంతః !!
మీరు తప్పుచేయకుండా చూసుకుంటాడు. మీరు మంచిచేయడానికి ప్రోత్సహిస్తాడు. మీ రహస్యాలను దాచిపెట్టి మీ మంచిగుణాలను చాటిచెప్తాడు. మిమ్మల్ని మీ కష్టకాలంలో వదలడు. మీకు సమయం కేటాయిస్తాడు. ఇటువంటి లక్షణాలు కలవాడు మంచిమిత్రుడు అని గురువులు చెపుతారు.
ఇంట్లో అందరితో మాట్లాడే విధానము/ తీసుకోవలసిన జాగ్రత్తలు
ఇంట్లో గాని బయట గాని కమ్యూనికేట్ చేయు విధానం
1. ప్రతి ఒక్కరితో గౌరవంగా మాట్లాడాలి
2. ప్రతిస్పందించేముందు పూర్తిగా వినాలి
3. వాదిస్తున్నప్పడు - ఆ విషయం పైన మాత్రమే వాదించండి. పాత విషయాలను లాగవద్దు, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దు, కేవలం ఆ వాదన గెలవడం కోసం అబద్దాలు చెప్పి, తలబాదేసుకోవడం, బెదిరించడం వంటి పనులు చేయవద్దు . మీరు అవి చేసి వాదన గెలిచివుండచ్చు కానీ ఇతర వ్యక్తులకు మీ పై నమ్మకం, గౌరవం పోతాయి.
కేయూరాణి న భూషయంతి పురుషం
హారా న చంద్రోజ్వల
న స్నానం న విలేపనం న కుసుమం
నాలంకృత మూర్ధజ
వాణ్యేకా సమలంకరోతి పురుషం
య సంస్కృతా ధార్యతే
క్షీయంతే కలు భూషణాని సతతం
వాగ్భూషణం భూషణం
మనం ఎన్ని ఆభరణాలతో శరీరాన్ని అలంకరించిన, ఉత్తమద్రవ్యాలతో స్నానం చేసినా మనం మాట్లాడే విధానం అన్ని అలంకారాలకంటే ఉత్తమమైన అలంకరణ మరియు క్షీణించనిది.
మనందరికీ నేను పైన ప్రస్తావించిన విషయాలు చాలా మట్టుకు తెలుసు. అయినా వాటిని ఆచరిస్తే గాని వాటి ప్రభావం తెలియదు. నిజానికి ధర్మం ప్రకారం నడుచుకునేవారి జీవితం కష్టాలను సుఖాలను సమతుల్యంగా అనుభవిస్తూ ధైర్యంగా ముందరకు అడుగువేస్తూ కుటుంబాన్ని సన్మార్గంలో తీసుకువెళ్లగలడని నా అభిప్రాయం.
ధన్యవాదములు.
Kommentare