ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల స్వచ్ఛత కార్యక్రమం: హిందుమిత్రుల ఘనవిజయం 🌸
- Srinivasa Malladi
- Oct 16
- 2 min read
🌸
నివేదికరచన: హిందూమిత్ర హరి (బొమ్మి శ్రీహరి)
విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార నుంచి కైలాసపురం వెళ్లే మార్గంలో, పోర్ట్ క్వార్టర్స్ దగ్గర గల కొండమీద దాదాపు యాభై సంవత్సరాల క్రితం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది.ఒకప్పుడు వెలుగొందిన ఆ దేవాలయం, కాలక్రమంలో భక్తుల నిర్లక్ష్యానికి గురై నిర్మానుష్యంగా మారింది.
ఇదే సమయంలో, ఆ కొండ ప్రాంతం యొక్క ప్రకృతి రమణీయతను గుర్తించిన ప్రస్తుత యువత, దురదృష్టవశాత్తు, ఆ ప్రదేశాన్ని అవాంఛనీయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని హిందూమిత్ర సభ్యులకు శ్రీ బాదిరెడ్డి రవిశంకర్ గారు తెలియజేశారు. దీనిపై చింతించిన హిందూమిత్ర, ఆలయ పరిసరాలను శుభ్రపరచాలని సంకల్పించింది.

🪷 తొలి దశ: మే 4, ఆదివారం
మొదటి ఆదివారం (మే 4వ తేదీ) నాడు సుమారు 15 మంది హిందూమిత్ర సభ్యులు ఉదయం ఆలయం తెరవకముందే అక్కడ చేరుకొని ఓంకార సాధన చేశారు. అనంతరం స్వామి వారి దర్శనం చేసి, పరిసరాల్లో ఉన్న ఖాళీ మద్యం సీసాలు మరియు ప్లాస్టిక్ చెత్తను ఏరడం ప్రారంభించారు.సుమారు నాలుగు బస్తాల చెత్త సేకరించి, గుబురుగా ఉన్న పొదలను తొలగించారు.ఇలా "మేమున్నాం, ఈ ఆలయం మాకు ప్రాణం" అనే సందేశాన్ని పరిసర ప్రజలకు చేరవేశారు.తరువాత హిందూమిత్ర పాలఘాట్ అన్నపూర్ణ గారి విరాళంతో ఏర్పాటుచేసిన అల్పాహారాన్ని సభ్యులందరూ నవ్వుతూ, ఆనందంగా స్వీకరించారు.

🌿 రెండవ దశ: జూన్ 8, ఆదివారం
తదుపరి నెలలో, అనగా జూన్ 8న కార్యకర్తల సంఖ్య 30 మందికి పెరిగింది. అవసరమైన సాధనాలతో రెండవ దఫా స్వచ్ఛ ఆలయ కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈసారి సుమారు ఆరు బస్తాల చెత్త — ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు ముక్కలు, పాత చెప్పులు, పాత దేవతా చిత్రాలు మొదలైనవి — సేకరించారు.తరువాత హిందూమిత్ర కార్యకర్త శ్రీమతి సంధ్య గారు స్వయంగా తయారుచేసిన అల్పాహారం, పోర్ట్ రిటైర్డ్ ఉద్యోగి శ్రీ ఎర్రిబాబు గారు అందించిన మజ్జిగ ప్యాకెట్లతో పాటు సేవించారు.

🌸 మూడవ దశ: జూలై 6, ఆదివారం
మూడవ దఫా కార్యక్రమంలో మరింతమంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్ల మార్గాన్ని పూర్తిగా శుభ్రపరిచారు.ఆలయం పైభాగంలోని చెట్ల కొమ్మలను తొలగించి, కొండవాలపై పెరుగుతున్న పొదలను వేర్లతో సహా తొలగించారు.దీనివల్ల ఆలయ పరిసరాలకు కొత్త రూపు వచ్చింది.

🔱 నాల్గవ దశ: శాశ్వత బోర్డుల ఏర్పాటు
నాల్గవ దఫాలో, తయారు చేసుకొచ్చిన శాశ్వత బోర్డులను ఆలయానికి వెళ్లే మెట్ల మార్గం మరియు రహదారి మార్గంలో సుమారు 10 ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు.దీనివల్ల స్థానిక గుడి కమిటీ దృష్టి ఆకర్షితమై, వారు కూడా స్పందించి JCBల సహాయంతో మరింత శుభ్రతా కార్యక్రమం చేపట్టారు. ఇది హిందూమిత్రకు ఆనందకరమైన ఫలితం.

బోర్డులు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే, అసహనపరులైన కొంతమంది అల్లరి మూకలు వాటిలో ఒకదాన్ని ధ్వంసం చేశారు.
ఈ సంఘటన మన హిందూ సమాజంగా ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తుంది —
మన స్వంత ప్రజలకే ప్రజా స్థలాలను సంరక్షించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇంకా ముఖ్యంగా మన సాంస్కృతిక మరియు ధార్మిక వారసత్వాన్ని కాపాడడం ఎంత కష్టమైన పనో ఈ ఘటన గుర్తుచేస్తుంది.

🌼 తదుపరి దిశ
అక్టోబర్ 5న హిందూమిత్ర సభ్యులు సమావేశమై, ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని సమీక్షించారు.ఈ స్ఫూర్తితో హిందూమిత్ర త్వరలో మరొక దేవాలయ పరిసరాలను శుభ్రపరచే “స్వచ్ఛ దేవాలయ కార్యక్రమం” ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

ఓం నమో భగవతే వాసుదేవాయ🙏
నివేదిక సమర్పణ:హిందూమిత్ర బొమ్మి శ్రీహరి





Comments