శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామ పర్యటన – జూన్ 22 (ఆదివారం) 2025
- Srinivasa Malladi
- Jun 23
- 4 min read
రచన: హిందూమిత్ర బొమ్మి శ్రీహరి

పయనారంభం – విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వైపు
జూన్ 22వ తేదీ ఆదివారంనాడు విశాఖపట్నం నుండి హిందూ మిత్ర సభ్యులు 15 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం లో జరిగిన నష్టాన్ని తెలుసుకోవడానికి బయలుదేరారు . ఉదయం 6 గంటలకి విశాఖపట్నంలో బయలుదేరి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చేరి అక్కడ హిందూమిత్ర సభ్యులైన మరియు అభిమానులైన డాక్టర్ హర్షవల్లి ,విజయ్ దంపతులు మరియు డాక్టర్ జి సోమేశ్వరరావు గారిని కలిసాము, వారు మాకు సాదర స్వాగతం పలికారు. వారితో కలిసి అమృత ఆహారం లాంటి అల్పాహారం తీసుకుని, హీరమండలం పరిధిలోని కూర్మ గ్రామానికి బయలుదేరాం.

2. శ్రీముఖలింగేశ్వర ఆలయం దర్శనం
మార్గమధ్యలో దాదాపు 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడి నేటికీ పూజలందుకుంటున్న శ్రీముఖలింగేశ్వరుడి దర్శనం చేసుకున్నాము, అక్కడే ఉన్న శ్రీ వారాహి పార్వతి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము ఆ ఆలయం వెనుకే వంశధార నది పరుగులు పెడుతూ ఉంటుంది , ఆ నదిలో ఒకటి తక్కువ కోటిలింగాలు ఉన్నాయని అక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు దానికి ఉదాహరణగా మనకు అడుగుకొక శివలింగం కనబడుతుంది,ఆ ఆలయం ఎంతో ప్రత్యేకమైన శిల్ప కళను కలిగి ఉన్నది, ఆలయ ప్రాంగణంలో వేద ఆశీర్వచనం తీసుకుని అక్కడికి 9 కిలోమీటర్ ల దూరంలో ఉన్న కూర్మ గ్రామానికి బయలుదేరాము. దారిలో వంశధార కాలువ పక్కనే మా ప్రయాణం సాగింది,ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం లో చుట్టూ రేగడి భూమిలో వ్యవసాయానికి సిద్ధమవుతున్న పంట పొలాలను దాటుతూ, ఆధ్యాత్మిక చర్చను సాగిస్తూ ఉత్సాహంగా ప్రయాణం సాగించాము

3. కూర్మ గ్రామానికి చేరిక మరియు స్వాగతం
డాక్టర్ హర్షవల్లి విజయ్ దంపతులు మరియు డాక్టర్ జి సోమేశ్వరరావు గారు అంతకుముందే కూర్మ గ్రామానికి చెందిన ముఖ్యులు ప్రభుదాస్ జి లతో మాట్లాడడం జరిగింది. అందుకేనేమో అక్కడి ప్రభుదాస్ జి మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానించి కూర్మ గ్రామాన్ని అంతా తిప్పి చూపించారు. ఈ క్రమంలో మేము మొట్టమొదటగా ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న పుస్తకాలయం దాటి ప్రస్తుత తాత్కాలిక భజన మందిరాన్ని చేరాము. ఈరోజు ఆదివారం ఏకాదశి కావడం మూలాన చాలామంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు అక్కడ ఆ ప్రార్ధన మందిరంలో ఆ సమయానికి జరిగే భజన మరియు భాగవత ప్రవచనం లో మునిగి ఉన్నారు.
ఆ దారిలో మేము వర్ణాశ్రమ పాఠశాలను చూశాము. అక్కడి పిల్లలు ఎటువంటి విధమైన వర్గ, కుల,జాతి భేదాలు లేకుండా సమాన స్థాయిలో పూర్తి వైదిక మార్గంలో భాగవతము మరియు భగవద్గీతను నేర్చుకుంటున్నారు .చిన్న పిల్లలు శిఖ పెట్టుకొని, పంచ కట్టుకుని తిరుగుతూ ఉంటే మనసులో ఆనందం కలిగింది. నిజంగా వేద కాలం లోకి ప్రయాణం చేసినట్లు అనిపించింది. ఆ పక్కనే చెక్క గానుగ ఏర్పాటు చేయబడి ఉన్నది. అక్కడి భక్తుల అవసరాల కోసం అన్నదానం కోసం అక్కడే పండిన కొబ్బరి నుండి,నువ్వుల నుండి మరియు వేరుశెనగ గింజల నుండి నూనె తీసి వాడుతుంటారని తెలిసి ఆశ్చర్యం కలిగింది.
4. వంటశాల, బావులు – భక్తి శ్రద్ధకు నిదర్శనం

ఆ ప్రక్కనే ఉన్న వంటశాలకు వెళ్లి అక్కడ కట్టెల పొయ్యి ద్వారా జరుగుతున్న వంటను చూశాము అక్కడ భక్తిశ్రద్ధలతో వంటలను సిద్ధం చేస్తున్న వారిని చూస్తూ పక్కనే ఉన్న బావిని కూడా చూశాము. అక్కడ చాలా బావులు ఉన్నాయి అయితే ఈ వంటశాల పక్కనే ఉన్న బావి నీళ్లు కేవలం ప్రసాదాలకు మాత్రమే వంటకు మాత్రమే వినియోగిస్తారు, ఇక్కడి నీటిని ఎవ్వరూ ఎంగిలి చేయడం గాని కాళ్లు కడగడం గాని చేతులు శుభ్రం చేసుకోవడానికి గానీ వాడకుండా పవిత్రంగా ఉంచుతున్నారు, భక్తుల అవసరాల కోసం ప్రత్యేక బావులు ఉన్నాయి, ఈ విధానం మాకు నచ్చింది. అంటే భక్తి శ్రద్ధ ఎంతగా వాళ్ళు పాటిస్తున్నారు మేము గమనించాం . అక్కడి నుంచి మేము అక్కడ జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ భూమిలోకి వెళ్లడం జరిగింది .

5. వర్ణాశ్రమ పాఠశాల – వేద విద్యాశాఖ

ఆ మార్గంలోనే అక్కడి వ్యవసాయ అవసరాల కోసం వాళ్లు ఏర్పాటు చేసుకున్న ఒక కొలను ఉంది. ఆ కొలనులో అక్కడి విద్యార్థులు అక్కడి గోవులను శుభ్రం చేయడం మాకు కనిపించింది. ఆ పిల్లలు భగవద్గీత శ్లోకాలు చదువుతూ వాటిని కడుగుతున్నారు . ఆ గోవులకు పేర్లున్నాయట, ఆ పేర్లతో వాటిని పిలుస్తూ, తీసుకువెళ్తూ స్నానం చేయిస్తున్నారు .
అక్కడి నీటిని పొలం నకు మళ్లించడానికి వారు ఒక గానుగని ఏర్పాటు చేసుకున్నారు. అటు తర్వాత సన్యాసులు జీవించే కుటీరాలను చూశాము, వాటికి కొద్ది దూరంలో ఉన్న గృహస్తులు ఉండడానికి అనువైన గృహాలను చూపించి, ఎలా వినియోగిస్తారు వివరంగా చెప్పారు. అక్కడ ఎక్కడ కూడా విద్యుత్ స్తంభాలు లేవు. ఆ గ్రామంలో విద్యుత్తు లేకుండా జీవిస్తున్నారు ఏ విధమైన మొబైల్ సిగ్నల్ కూడా అందుబాటులో లేదు, అంటే అక్కడ ఫోన్లు కూడా పనిచేయవు, మేము వినడమే గాని చూడడం చూడడం అదే మొదటిసారి. సాధారణంగా ఏ సౌకర్యాలు లేని అడవులలో గిరిజనులు జీవించడం చూసాము, విన్నాము కానీ, ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేసి, పట్టణ జీవితం లో చాలా కాలం గడిపిన వీరు ఇక్కడ ఇంత సాధారణ జీవితాన్ని గడపడం చూసి మేము ఆశ్చర్యం చెందాము. అక్కడి ఇళ్లలో సిమెంటు వినియోగం చాలా తక్కువ గృహం వెలుపలే సిమెంటు ఉపయోగించారు లోపలి భాగంలో పూర్తిగా మట్టితో అలిగి ఉన్నది, పై భాగంలో పూర్తిగా తాటి వెదురు కలపతో నిర్మించబడి ఉన్నది, పైకప్పు అక్కడక్కడ అద్దాలతో నిండి ఉన్నది, అనగా ఇంటి లోపల విద్యుత్ బల్బు లేకుండానే వెలుతురు ప్రసరించడం కోసం ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడివారు ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకి పనులన్నీ ముగించుకుని నిద్రకు ఉపక్రమిస్తారు అని తెలుసుకుని మరోసారి ఆశ్చర్యం చెందాము.
8. సన్యాసి మరియు గృహస్తుల నివాసం

అక్కడి ప్రభుదాసు జీ , వారి యొక్క ఆధ్యాత్మిక ఆచరణను వివరంగా తెలియజేశారు, వారి మాటల్లో మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక సమతులన జీవనం కనపడింది , ఎక్కడ కూడా నాగరికతలో ఉన్నత స్థితిని విడువకుండా, ప్రకృతిని నాశనం చేయకుండా, ఆరోగ్యకరమైన జీవనాన్ని ఆలోచన విధానాన్ని మాకు తెలియజేశారు . ఆహార నియమాలు రజోగుణ, తమోగుణ నియంత్రణ ఎలా చేస్తున్నారో తెలియచేశారు. అక్కడ సుమారుగా 16 కుటుంబాలు ఈ విధంగా జీవిస్తున్నాయి. వారు అక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆహారాన్ని ప్రతిరోజు ఉచితంగా అందజేస్తారు.
అన్నదానం – విశిష్ట ఆదర్శం

అలాగే పర్వదినాల్లో అనగా ఏకాదశి పౌర్ణమి పండుగలు సందర్భాలలో సుమారుగా రోజు 5000 మంది, కృష్ణాష్టమి వంటి పర్వదినం రోజు సుమారు 15 వేల మంది కి అన్నప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తారు. అక్కడ ఎటువంటి రుసుము లేదు ,దర్శనానికి ప్రసాదానికి,మరియు ఎవరైన భక్తులు అక్కడ బస చేయడానికి ఎటువంటి రుసుము లేదు. భక్తుడు ఏదైనా తన ఇష్ట ప్రకారం దానంగా ఇస్తే మాత్రం పుచ్చుకుంటారు. కేవలం ఆదివారం జరిగే అన్న ప్రసాదానికి మాత్రమే ఒక 5116 రూపాయలు ని విరాళంగా నిర్ణయించారు. మిగతా ఎటువంటి విధమైన ధరల పట్టిక అక్కడ మాకు కనపడలేదు. ఎవరి ఇష్టానుసారం వారు సమర్పించవచ్చు. అక్కడ భజన అద్భుతంగా ఉంది. అక్కడ ప్రవచనం ద్వారా భక్తుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు, అలాగే ఎవరైనా భక్తుడు లేదా భక్తురాలు తమ సందేహాలను అడిగి సమాధానాలు పొందుతున్నారు. అక్కడ ఇచ్చే సమాధానాలు పూర్తిగా భగవద్గీత నుండి భాగవతం నుండి భారతం నుండి ఇవ్వబడుతున్నాయి.
10. ప్రభుదాస్ జీ ఆచరణ – సమతుల్య జీవనం
అక్కడ ఉండే ప్రభుదాసు గారు ఎంతో ప్రజ్ఞతో సమాధానం ఇస్తున్నారు . ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా మాకు కనిపించారు. వారి మాటలు మన హిందూ మిత్ర విధానాలకు దగ్గరగా ఉన్నాయని మాకు అనిపించింది. జాతి, కులము, మతము ఎక్కడా ఆ వాతావరణం లేదు. వర్ణభేదం కూడా లేదు. సమ భావనతో అక్కడి మనుషులు ఉన్నారు. మీలో ఎవరైనా ఈ యొక్క గ్రామాన్ని సందర్శించాలంటే నిస్సందేహంగా వెళ్లవచ్చు. ప్రయాణ సౌకర్యం సులభంగానే ఉంది, రోడ్డు మార్గం ద్వారా చేరవచ్చు. ముందుగా తెలియచేసి, అనుమతి తీసుకున్నట్లయితే, అక్కడ మనకు ఉచిత బస లభిస్తుంది.
11. అగ్ని ప్రమాదం – విచారకర ఘటన

ఈ విధంగా ఉన్న కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం ఎన్నో సందేహాలకు తావిస్తుంది, ఎందుకంటే అక్కడి వారు రాత్రి ఎనిమిది గంటల 30 నిమిషాలకి వారి దినచర్య ముగించి, వారి వారి నివాసాలకు చేరుతారు. కానీ ప్రమాదం రాత్రి 9 గంటల 45 నిమిషాలకు జరిగింది ఈ అగ్ని ప్రమాదానికి బయటి వారే కారణం అని అనిపించింది. ఇది ఎవరో ద్వేషంతో, అసూయతో చేశారనిపించింది. అక్కడ అగ్నిప్రమాదంలో దాదాపుగా 60 లక్షల రూపాయలు పైగా ఆస్తి నష్టం జరిగింది, ఆ యొక్క అగ్ని ప్రమాదం జరిగిన సమావేశ మందిరం సుమారుగా 7 500 చదరపు అడుగులతో చాలా భారీగా నిర్మితమైంది, పూర్తిగా చెక్క కలపతో నిర్మించబడి ఉన్నది. అందువల్లనేమో కేవలం గంటలోనే బూడిదగా మారిపోయింది, లోపల అక్కడి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న 10 వాటర్ ప్రూఫ్ టెంట్లు పూర్తిగా కాలిపోయాయి, కొన్ని వేల పుస్తకాలు కాలి బూడి అయ్యాయి ,నిల్వ ఉంచబడిన ఎంతో సామాగ్రి బూడిదయ్యింది. ఎంతో బాధ వేసింది . ఆ యొక్క మందిరం 25 అడుగుల ఎత్తు ఉన్నది కానీ కాలి బూడిద అయిన తర్వాత చెక్క స్తంభాలు కేవలం మూడు అడుగులకు మిగిలిపోయాయి. అక్కడే ఏర్పాటు చేసుకున్న శ్రీల ప్రభుపాదుల వారి విగ్రహం కూడా ఆహుతి అయి, హృదయ విదారకంగా ఆ ప్రాంతం కనిపించింది. మా మనస్సులు బాధతో నిండిపోయాయి. వారికి ఎంతైనా సాయం చేయాలనిపించింది, అయితే ఈ సాయం అందరి భాగస్వామ్యం ఉండాలనిపించి ,ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాము.
12. మన వంతు సహాయం – ఓ పిలుపు
హిందూమిత్ర ఫౌండేషన్ ద్వారా ఈ ధనసంగ్రహణ ఉద్యమం లో పాల్గొని ప్రతి ఒక్కరు తమకు తోచిన సహాయం అందిచగలరని మనవి. హిందూమిత్ర ఫౌండేషన్ ఖాతా వివరాలు: Account number: Hindumitra Seva Foundation
Account Number: 50200078641890
IFSC: HDFC0009100
Branch: VIP ROAD BALAJI NAGAR, Visakhapatnam
Account Type: CURRENT
Type Reference: “SUPPORT KURMAGRAMAM”
Kindly note you can ONLY TRANSFER FROM AN INDIAN RUPEE ACCOUNT. Send confirmation of transfer via WhatsApp to 7288000126
ఇంతటి మహోన్నత, ప్రయత్న పూర్వక జీవన విధానాన్ని మనం స్వాగతించాలి, ప్రోత్సహించాలి, అవకాశం ఉన్నపుడు అనుభవించాలి అని మా విన్నపం.
Комментарии