పోతన ఆణిముత్యం: భక్తిలేని మనిషి రెండుకాళ్ల జంతువు మాత్రమే!
- Srinivasa Malladi
- Nov 14, 2025
- 2 min read

కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? ; పవన గుంఫిత చర్మభస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే? ; ఢమఢమధ్వనితోడి ఢక్క గాక;
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? ; తరుశాఖనిర్మిత దర్వి గాక?
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే? ; తనుకుడ్యజాలరంధ్రములు గాక;
చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళసలిలబుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి పశువు గాక.
భావార్థం
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? ; పవన గుంఫిత చర్మభస్త్రి గాక;
పద్మాలవంటి కన్నులు కలిగిన విష్ణుమూర్తికి మన శరీరమును ఉపయోగించకపోతే నిజమైన శరీరమేనా? కాదు. అది గాలి నింపిన తోలు సంచిలా నిరర్థకం అవుతుంది.
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే? ; ఢమఢమధ్వనితోడి ఢక్క గాక;
వైకుంఠనాథుడ్ని స్తుతించని నోరు నిజమైన నోరా? ఢమఢమంటూ శబ్దం చేసే ఖాళీ డప్పులా ఉంటుంది.
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? ; తరుశాఖనిర్మిత దర్వి గాక?
హరిని పూజించని చేయి నిజమైన చేయి అవుతుందా? కాదు. అది చెట్టుకొమ్మతో చేయబడిన నిర్జీవమైనది చెక్క గరిటె అవుతుంది.
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే? ; తనుకుడ్యజాలరంధ్రములు గాక;
కమలనాభుడి (విష్ణువు)ని చూడని కన్నులు నిజమైన కన్నులేనా? అవి గోడకి ఉన్న కిటికీల వలే శరీరంలో ఉన్న చిన్నచిన్న రంధ్రాలు మాత్రమే అవుతాయి..
చక్రిచింత లేని జన్మంబు జన్మమే? తరళసలిలబుద్బుదంబు గాక;
చక్రధారిని (విష్ణువు) ధ్యానించని జీవితం నిజమైన జన్మమా? అది తాత్కాలికమైన నీటి బుడగలా విలువ లేని దానిగా పోతుంది.
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే? పాదయుగముతోడి పశువు గాక.
వైష్ణవ భక్తి లేని జ్ఞాని నిజమైన పండితుడా. కాదు. అతను దైవత్వము తెలియని రెండు కాళ్ళ జంతువు మాత్రమే.
సారాంశం
నేను ఈ శరీరములోని ఆత్మను. ఆ ఆత్మే పరమసత్యం. అదే సర్వవ్యాప్తమైన భగవంతుడు. ఈ అంతర్యామిని తెలుసుకోవడానికి మన శరీరం, ఇంద్రియాలు, మనస్సు పని వస్తువులులాగా సరైన దిశగా ప్రయోగించాలి.
ఇంద్రియములంటే ఏమిటి? దేనితోనైతే మనం చుట్టుపక్కల విషయాలను తెలుసుకుంటామో అవే ఇంద్రియాలు. చెవి, ముక్కు, నాలుక, కళ్ళు, చర్మము. మరి ఇవి అవసరమైనవి–అనవసరమైనవి అన్నిటిని గ్రహిస్తాయి. కాని వాటిని ఎల్లపుడూ సత్యాన్ని తెలుసుకోవడానికే ఉపయోగించే విధంగా శిక్షణ ఇవ్వాలి. దానికి మన బుద్ధిని ఉపయోగించి మనస్సుని భగవంతునిపై ధ్యానం, ప్రార్థనల ద్వారా కేంద్రీకరించి అభ్యాసం చేస్తే సాధ్యమవుతుంది.
బమ్మెర పోతన గారు ఈ పద్యంతో మనకు బోధించినది— “విష్ణుభక్తి లేకుండా శరీరం, మాట, చేతులు, కన్నులు, జన్మ—ఏది తన నిజమైన విలువను నిలబెట్టుకోదు.” ఈ పద్యాన్ని గానం చేస్తూ, దాని భావాన్ని ఆచరణలో పెడదాం. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే సనాతన ధర్మ సారము.
రచన: హిందూమిత్ర Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి




Comments