వస్తున్నానని చెప్పనా! ఇంకా ఐదు నిమిషాలు
- Srinivasa Malladi
- 6 days ago
- 1 min read

శ్లోకం
ఏవం గృహేషు సక్తానాంప్రమత్తానాం తదీహయా ।
అత్యక్రామదవిజ్ఞాతఃకాలః పరమదుస్తరః ॥ 1.12.17 ॥
అర్థం
ఇలాగ, కోరికలలో పూర్తిగా మునిగిపోయి అనవసరమైన పనులతో కాలక్షేపం చేస్తే తెలియకుండానే కాలం అతనిని హెచ్చరిక లేకుండానే కబళిస్తుంది. 👉 మనిషి గమనించకముందే కాలం అతన్ని పట్టుకుంటుంది. కాలాన్ని ఎవరూ జయించలేరు.
కథ “ఇంకా ఐదు నిమిషాలు.”
ఒక ఊరిలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి ఆటలు చాలా ఇష్టం. “ఇంకా ఐదు నిమిషాలు…” అని చెప్పడం అతని అలవాటు. అమ్మ చదవమంటే — “ఇంకా ఐదు నిమిషాలు.” నాన్న పిలిస్తే — “ఇంకా ఐదు నిమిషాలు.”
అతనికి ఒక చిన్న గడియారం ఉండేది.అది ఎప్పుడూ టిక్కు… టిక్కు… అని నడుస్తూ ఉండేది.
ఒకరోజు తాత రవిని అడిగాడు: “రవి, నీ గడియారం ఏమి చెబుతోందో తెలుసా?”
రవి నవ్వుతూ అన్నాడు: “అది సమయం చెబుతోంది!”
తాత మృదువుగా అన్నాడు: “అది నిన్ను హెచ్చరిస్తోంది కూడా.”
“ఎలా?” అని రవి అడిగాడు. తాత చెప్పాడు:“నువ్వు ఆటలో, టీవీలో, కోరికల్లో మునిగిపోయినప్పుడుసమయం నిశ్శబ్దంగా ముందుకు వెళ్తుంది.నువ్వు గమనించేలోపే అది గడిచిపోతుంది.”
ఆ రోజు నుంచి రవి మారాడు. ఆడేవాడు, చదివేవాడు,అమ్మనాన్న మాట వినేవాడు, ప్రతి రోజు కొంచెం మంచిగా ఉండే ప్రయత్నం చేసేవాడు.
గడియారం ఇంకా నడుస్తూనే ఉంది.కానీ ఇప్పుడు రవి సమయాన్ని గమనిస్తున్నాడు.
కథ ద్వారా పిల్లలకు సందేశం
సమయం అరవదు.మనం ఆడుకుంటున్నా, ఆలస్యం చేస్తున్నా — అది ముందుకే వెళ్తుంది.అందుకే ప్రతి రోజు మంచిగా, జాగ్రత్తగా జీవించాలి. ఇదే ఆ శ్లోకంలోని రహసం.
ఆలోచన: హిందూమిత్ర మల్లాది శ్రీనివాస శాస్త్రి




Comments