top of page
Search

మాట వైభవం/ గొప్పతనం

రచన: హిందూమిత్ర పొట్నూరు ఐశ్వర్య


పిల్లలు మీకు తెలుసు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని మన పెద్దలు అంటుంటారు. మన మాట మనకి గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. మన మాట మనకి మిత్రులను సమకూరుస్తుంది, మన మాట మనకి సంపాదనని తెచ్చి పెడుతుంది. ఇలా చెబుతుంటే రామాయణం లో ఒకరి గురించి గుర్తుకు వస్తుంది. ఆయన మీకు కూడా బాగా పరిచయస్తులే, ఎవరో తెలుసా? ఎవరైనా చెప్పగలరా?


హా ఆయనే హనుమా,

ఆయనను ఆంజనేయుడనీ పవన తనయుడి అని పలు పలు విధాలుగా పిలుస్తుంటారు.


మనం కథలోకి వెళితే సీత దేవిని వెతుక్కుంటూ రామ లక్ష్మణులు అడవిలో వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఋష్యమూక పర్వతం వైపు వెళుతూ ఉంటారు. రామ, లక్ష్మణులను చూసి ప్రాణభయంతో పరుగు తీస్తున్న వానరేశ్వరుడు సుగ్రీవునకు ధైర్యం చెప్పి…భిక్షుకరూపంలో (బ్రాహ్మణ) రామ, లక్ష్మణుల దగ్గరకు వస్తాడు హనుమంతుడు. తను వచ్చిన విషయాన్ని.., తడబడకుండా, గొంతు చించుకు అరవకుండా, కనుబొమలు ఎగరేయకుండా., స్పష్ఠంగా, ముచ్చటగా మూడుమాటల్లో చెప్పి., వారు ఎందుకు వచ్చారో అడుగుతాడు హనుమంతుడు. ‘లక్ష్మణా.. విన్నావుకదా.. ఈ వానరుని ప్రసంగం. చతుర్వేదాలు, నవ వ్యాకరణాలు ఆమూలాగ్రంగా వచ్చినవాడే.. ఇంత ఆహ్లాదకరంగా ప్రసంగించగలడు. ఇటువంటి సచీవుడు ఉన్న రాజు, ప్రపంచాన్నే శాసించగలడు. ఇట్టి వాక్చాతుర్య కుశలునితో, మనం వచ్చిన కార్యాన్ని చాలా జాగ్రత్తగా వివరించాలి సుమా.’ అని అంటాడు శ్రీరాముడు.


సకలకళాకోవిదుడైన శ్రీరాముడు., తనంతటి వాడైన లక్ష్మణుని హెచ్చరించిన సందర్బము రామాయణంలో ఇది ఒక్కటే. అదీ… మన హనుమంతుని వాగ్వైభవం.


రామ, సుగ్రీవులకు అగ్నిసాక్షిగా మైత్రి కలిపి, ధర్మచ్యుతుడైన వాలి వధకు మార్గం సుగమం చేసి., కిష్కింధకు సుగ్రీవుడు ని పట్టాభిషిక్తుడను చేస్తాడు.


అశోకవనంలో సీత కనిపించింది. ఎలా కనిపించింది.? ప్రాణత్యాగానికి సిద్ధపడుతూ కనిపించింది. ఇప్పుడు…ఆమె ప్రయత్నాన్ని ఆపాలి. ఎలా? ఆమె అప్పటికే రాక్షసుల మధ్య ఉంది. ఎవరినీ నమ్మే స్థితి లో లేదు అప్పుడు హనుమ రామగానం చేసి,రామాంగుళి ఆమెకు ఇచ్చి, ఆమెకు ధైర్యం చెప్తాడు. అదీ మాట వైభవం.


రావణసభలో…రావణునికి హితోపదేశం చేసాడు.


విభూషణుడినిని సమూహంలో చేర్చుకోవాలా లేదా అనే వేళ, వానరులు ఎవరి అభిప్రాయం వారు చెపుతూ ఉంటారు. సుగ్రీవుడు గూఢచారి అని,


శరభుడు గూఢచారులను లంకకు పంపుదాం అని జాంబవంతుడు కాలం మరియు దేశం తగినవి కావు తీసుకోవద్దు అని, మైధునుడు ప్రశ్నలతో పరీక్షిద్దాం అని ఎవరి అభిప్రాయాలు వారు చెప్తున్న సమయంలో నీవేమి చెప్పవా హనుమా అన్నట్టు హనుమంతుల వారిని చూస్తారు రాముడు. అపుడు హనుమ మీరు ముల్లోకాలలో జరిగే విషయాలు చూడగల మహా జ్ఞాని మీకు ఒకరి సలహా అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి కానీ తర్కించడానికి కానీ వేరొకరి అభిప్రాయాన్ని ఖండించి సంఘర్షణ పడాలని కానీ ఈ విషయం చెప్పడం లేదు. మీరు నాయందు గౌరవం ఉంచి అడిగారు. కాబట్టి నేను మీ యందు గౌరవం ఉంచి చెబుతున్నాను...... అని ఆయన చెప్పి తరువాత అభిప్రాయం చెపుతారు....


మీరు గమనిస్తే ఆయన మాటతో సుగ్రీవుడిని కాపాడారు, పట్టాభిషిక్తుడిని చేశారు . సీతమ్మ ఉరిపోసుకోకుండా ఆపారు. అంగదుడు మిగిలిన వానరులు ప్రాయోపవేశం చేసే వేళ తన వాక్కుతో అందరిని కాపాడారు, తన మాట వల్ల శ్రీరాముడంతటి వాడి కౌగిలి లభించింది. మనం మామూలుగా చూస్తే శ్రీ రాముడు భువికి చక్రవర్తి ఎంత గొప్ప చక్రవర్తి అంటే ఆయన పాదుకలు రాజ్య పాలన చేస్తున్నా ఏ ఒక్క రాజు దండెత్తిన దాఖలాలు లేవు. అంతటి చక్రవర్తి మామూలు వానరాన్ని కౌగిలించుకోవడం అనేది ఆయన మాట వైభవానికి తార్కాణం.



అయితే చెప్పండి పిల్లలూ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతాది. మాట అనేది కొలబద్ద (స్కేలు) వేసుకుని మాట్లాడాల్సిందే.



 
 
 

Comments


Post: Blog2_Post

©2021 హిందూమిత్ర ద్వారా. Wix.comతో సగర్వంగా సృష్టించబడింది

bottom of page