మాదాకవళం — సామాజిక ధర్మానికి ప్రతీక ★ ఒక హృదయాన్ని హత్తుకునే కథ
- Srinivasa Malladi
- Nov 24, 2025
- 2 min read
Updated: Nov 28, 2025

పూర్వం అన్ని గ్రామాలలో వలే రాయలసీమలో ఈ చిన్న గ్రామం ఎప్పుడూ అందరికీ ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉండేది. ఎందుకంటే అక్కడి ప్రజల హృదయాల్లో ఉండేది మానవత్వం, పరస్పర సేవ, దానగుణం.
ఆ గ్రామంలో జీవించిన గృహస్థ–గృహిణులు తమ బిడ్డలను పెంచినంత ప్రేమతోనే పేదవారికి కూడా వండిన భోజనం ప్రతిరోజూ దాచేవారు. వారు చేసిన సేవలకు గూర్చి ఎప్పుడూ వ్యాఖ్యలు చేయరు… పేర్లు చెప్పరు…సేవే వారి శ్వాస, దానం వారి సహజ సనాతన ధర్మం.
కథ: “రోజూ దొరికే ఆ ఒక గిన్నె అన్నం"
ఆ గ్రామంలో సురప్పగారు, నాగమ్మ అనే దంపతులు ఉండేవారు. వీరు సాధారణ రైతులే. పెద్దగా సంపద లేదు… కానీ కరుణ మాత్రం కొండంత.
గ్రామం చివర్లో వృద్ధురాలు నరసమ్మ ఉండేది. పిల్లలు ఎవరు లేరు. భర్త చిన్నప్పుడే చనిపోయాడు. వయసు మీద పడడంతో పని చేయలేక పోయేది. రోజూ రెండు వేళల భోజనం దొరకడమే ఒక గొప్ప వరం.
సురప్పగారి ఇంట్లో ప్రతీ ఉదయం నాగమ్మ అన్నం వండేటప్పుడు, మొదటి గిన్నెను పక్కన పెట్టేది.
“ఇది నరసమ్మ కోసం,” అని ఆధరణగా నవ్వేది.
సురప్పగారు ఆ గిన్నెను తీసుకొని, “అమ్మా, నిన్ను భగవంతుడు మాకు అప్పగించాడు” అనే ప్రేమతో నరసమ్మ చాపపై ఉంచేవారు.
ఒక రోజు నవ యువకులు గ్రామానికి వచ్చి అడిగారు:
“మన గ్రామాలు ఎంత పవిత్రంగా ఉంటాయి తాత? ఈ మాదాకవళం ఆచరణ ఎలా వచ్చింది?"
అప్పుడు గ్రామ పెద్ద ముత్తయ్యగారు నవ్వుతూ చెప్పారు:
"మాదాకవళం! అని పిలవగానే దేవతామూర్తులైన గృహిణులు బయటకు వచ్చి ఆకలితోనున్న పేదవానికి భోజనం పెట్టడం అనేది మన పూర్వీకులు పెట్టిన అద్భుత ఆచారం నాయనలారా." మాదాకవళం అనేది ఒక మనోభావం.
ఇక్కడ ప్రతి ఇంటి చుల్లో వండిన అన్నం ఒక భాగం ఎవరైనా ఆకలితో ఉన్న వాడికి,
ప్రతి దుస్తులలో ఒక జంట పేదవారికి.
ప్రతి పండుగలో కనీసం ఒక కుటుంబం పంపకాలను పంచుకునే సంబరం.
ఇదే మన ఆచారం…ఇదే మన మాదాకవళ మనోభావం!”
గృహిణుల పాత్ర — సేవలో సత్యదీపాలు
ఆ కాలంలో గృహిణులు కేవలం ఇంటి పనులు చూసుకునేవారు కాదు;
గ్రామానికి హృదయం, సమాజానికి తల్లులు, పేదలకు దేవతలు.
వారు చేసిన సేవలు:
* వంట పూర్తయిన వెంటనే “కొంత పేదవాడికి పెట్టాలి” అనే భావం
* ప్రసవించిన అమ్మకు నెలరోజులు అన్నం, మందులు ఇచ్చి ఆదరించడం
* పేద పిల్లలకు పాత బట్టలు శుభ్రపరచి ఇస్త్రి చేసి ఇవ్వడం
* పంట వచ్చినప్పుడు ఒక **కొలగాని** ముందే పక్కన పెట్టి పేదలకు ఇవ్వడం
* పండగలప్పుడు ఏ పేద కుటుంబం ఆకలితో ఉండకూడదనడం
* ఎవరికైనా పని లేకపోతే తమ ఇంట్లో పనులు ఇచ్చి పోషించడం
వారు ఎప్పుడూ గర్వపడరు…ఎప్పుడూ ప్రకటనలు చేయరు…
వారి సేవ అనేది నిశ్శబ్ద దానం — దైవానికి తుల్యం.
మాదాకవళం యొక్క అంతరార్ధం
మాదాకవళం సామాజిక ధర్మానికి ప్రతీక. ఒక సనాతన ధర్మ ఆధ్యాత్మిక విలువ. ఒక జీవనశైలి. ఒక మానవత్వపు పాఠం. సమాజంలో ఎవరైనా కష్టంలో ఉంటే, అది నా సమస్యే— అని భావించే హృదయాల సమూహమే మాదాకవళం.
మనకు ఉన్నదాంట్లో కొంత లేనివారితో పంచుకోవాలి.
మన భోజనం ముందు మరొకరి ఆకలి తీర్చాలి.
మన సుఖాల ముందు సమాజ సంక్షేమం గురించి ఆలోచించాలి.
సేవ చేయడానికి ధనం అవసరం లేదు — హృదయం చాలు.
ఆలోచన: హిందూమిత్ర సంధ్యా




Comments