యక్ష ప్రశ్నలు
- Srinivasa Malladi
- Nov 26, 2025
- 1 min read
Updated: Nov 28, 2025
రచన: హిందూమిత్ర పొట్నూరు ఐశ్వర్య

పిల్లలు! మీకు తెలుసా యక్ష ప్రశ్నలు అంటే ఏమిటో? ఏమి తెలిసినా పరవాలేదు. చెప్పండి? సరే నేను చెప్పనా? చిక్కు ప్రశ్నలని యక్ష ప్రశ్నలు అంటారు.
దీనికి ఒక చిన్న కథ ఉంది. తెలుసుకుందామా? సరే. మీలో ఎంతమందికి పాండవుల గురించి తెలుసు? వాళ్ళు ఎంతమంది? ఎవరెవరు? సరే మనం కథ లోకి వెళ్దాం.
పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన అరణి లేడికొమ్ములలో యిరుక్కొని పోయినదని చెప్పి, దానిని తెచ్చి యివ్వవలసినదిగా కోరాడు. కోరగా ధర్మరాజు అతని నలుగురు తమ్ముళ్లు లేడిని పట్టుటకు బయలుదేరినారు.
కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ముళ్లను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు.
అంతలో అదృశ్యవాణి పలికినది... "ధర్మనందనా! నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ముళ్లు అహంభావంతో దాహం తీర్చుకోబోయినందున ఈ గతి పట్టినది. నీవైనను, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో" అన్నాడు యక్షుడు. "సరే" అన్నాడు ధర్మరాజు.
ఈ యక్షుడు అడిగిన ప్రశ్నలనే "యక్ష ప్రశ్నలు", అని అంటారు.
మీకు తెలుసా యక్ష ప్రశ్నలు ఎన్ని ఉన్నాయో? 125.
యక్షుడుగా వచ్చినది ఎవరో తెలుసా? యమధర్మరాజు.
ఉదాహరణకు ఒక యక్ష ప్రశ్న చూద్దాం.
యక్షుడు: "ధర్మరాజా!… ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది ఏమిటి?”
ధర్మరాజు: “మనసు! మనసుకంటే వేగంగా ఇంకేమీ పరిగెత్తదు.”
ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రశ్నలు ఉన్నాయి. వాటిని మనం **ఇంకోసారి** ఆసక్తిగా తెలుసుకుందాం.




Comments