జాతి గౌరవం - వర్ణ వైభవం - ధర్మ రక్షణం
- Srinivasa Malladi
- Dec 13, 2025
- 1 min read
మరణసమయంలో పాండవులను ఉద్దేశించి భీష్ముని వాక్కు

శ్రీమద్ భాగవతం శ్లోకం
అహో కష్టమహోఽన్యాయ్యం యద్యూయం ధర్మనందనాః |
జీవితం నార్హథ క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయాః || ౧౨ ||
భీష్మదేవుడు ఇలా అన్నాడు:
"అయ్యో! ధర్మస్వరూపుని కుమారులైన మీరు ఎంత ఘోరమైన కష్టాలను, ఎంత తీవ్రమైన అన్యాయాలను అనుభవించారో! ఆటువంటి విపత్తుల మధ్య మీరు జీవించి ఉండటం కూడా తగినదిగా అనిపించదు. అయినా, బ్రాహ్మణుల ఆశ్రయం, భగవంతుని కృప, ధర్మరక్షణ వల్ల మీరు సురక్షితులుగా నిలబడ్డారు.”
పాండవులు అనుభవించిన అనేక కష్టాల మధ్యలోనూ వారు పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా నిలబడగలిగినదానికి కారణం మూడు ఆశ్రయములు:
శ్రీకృష్ణుని పరమాశ్రయం,
బ్రహ్మజ్ఞానాన్ని అనుభూతి చేసి, అందులోనే జీవిస్తూ లోకాన్ని దారిచూపే సత్‌బ్రాహ్మణుల ఆశ్రయం.
ధర్మము
ఇది కేవలం పాండవుల కథ కాదు—ఇది ఒక సనాతన ధర్మ సూత్రం.
క్షత్రియులు రాజ్యాన్ని ధర్మంగా పాలించాలంటే,
సామాన్య ప్రజలు నైతికంగా జీవించాలంటే,
ధర్మం మరియు దేశం క్షేమంగా ఉండాలంటే,
బ్రహ్మజ్ఞానమే ప్రధాన సాధనగా జీవించే బ్రాహ్మణుల పాత్ర అనివార్యం.
అటువంటి బ్రాహ్మణులు జన్మ ఆధారంగా కాదు, గుణం, కర్మ, జ్ఞానం, త్యాగం, మరియు ఆత్మానుభవం ఆధారంగా వెలిసినవారు. కానీ ఈ కాలంలో జన్మాధారిత కాక బ్రహ్మజ్ఞాననిష్ఠులైన బ్రాహ్మణులు అత్యంత అరుదుగా కనిపిస్తున్నారు. ఈ సంఖ్య పెరగాలంటే గుణకర్మ ఆధారితమైన వర్ణము ప్రకారం ఆచరిస్తున్న విభిన్న వర్ణముల వారిని జన్మప్రకారం ఏ జాతివారైనప్పటికీ గుర్తించి గౌరవించాలి. అందువల్ల రాబోయే కాలంలో సమగ్ర హైందవ సమాజం ఈ కీలక బాధ్యతను స్వీకరించవలసిన అవసరం ఉంది.
విభేదాలను విడిచిపెట్టి, జన్మకేంద్రీకృత భావాలను అధిగమించి,
గుణ–కర్మ ఆధారిత వర్ణవైభవాన్ని పునరుద్ధరించడంలో సమిష్టిగా కృషి చేయడం.
అలా జరిగితే మాత్రమే సనాతన ధర్మం తన సహజ తేజస్సుతో మళ్లీ వికసించి, లోకక్షేమానికి దారితీయగలదు.
మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవలసినది
సనాతన ధర్మమే ప్రధానం నిత్యం సత్యం
మిగిలినవన్నీ సనాతన ధర్మ ఆధారితం అయినప్పటికీ అప్రధానం పరివర్తనశీలం
హిందూమిత్ర Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి




Comments