శ్రీకృష్ణుని బంగారు బోధ: ఇద్దరి స్నేహితుల సంభాషణ
- Srinivasa Malladi
- Nov 28, 2025
- 2 min read
పాత్రలు: * చిన్నారి – ప్రశ్నలు అడిగే తెలివైన పిల్ల
* బాలు – శ్లోకాలు చెప్పే, కథలు చెప్పే పిల్ల
సన్నివేశం: పార్క్‌లో ఇద్దరూ కూర్చుని మాట్లాడుతున్నారు.

ఎదుటివారి మానసిక స్థితిని తెలుసుకుని జ్ఞానం పంచాలి
చిన్నారి : "బాలూ… నిన్న మీ గురువు గారు భగవద్గీతలో చాలా మంచి పాఠం చెప్పారని విన్నాను. అది ఏమిటో చెప్పవా?
బాలు: తప్పకుండా చెప్తాను చిన్నారి! భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనం ఎవరికైనా ఏదైనా చాలా లోతైన జ్ఞానాన్ని నేర్పించేటప్పుడు ఎదుటివారికి వారు అర్థంచేసుకోగలిగే మానసిక స్థితిని తెలుసుకుని జ్ఞానం పంచాలని అద్భుతంగా చెప్తాడు.
బాలు: ముందుగా కృష్ణుడు ఇలా అంటాడు —
“న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం ।
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్‌యుక్తః సమాచరన్ ॥ 3.26 ॥”
దీని అర్థం ఏమిటంటే: కొత్తగా నేర్చుకుంటున్న వాళ్లకి ఒక్కసారిగా కష్టమైన విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే అలా చేస్తే వారికి గందరగోళం అలాగే కలిగించిన వారమవుతాము. వాళ్లకు అర్థమైన విషయాలు మనం తెలుసుకుని వారిని గౌరవించి అత్యంత ప్రేమతో సహనంతో సులభమైన విషయాలను నేర్పించి ప్రోత్సహించాలి. మరొక విషయం.
వారికి నేర్పించాలంటే నువ్వు ప్రతి రోజు ఆ విషయాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తే వారికే మెల్లగా అర్థం అవుతుంది. దానినే భగవద్గీతలో "జ్ఞానం విజ్ఞాన సహితం" అని అంటదు శ్రీకృష్ణుడు. దాని అర్థం ఏమిటంటే - నువ్వు ఎవరికైనా ఏదైనా నేర్పించాలన్నా నిరూపించాలన్న తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెడితే అదే సులువుగా అర్ధమయ్యి మిగిలిన వారు ఆచరిస్తారు.
అంతే కానీ తొందర పెట్టకూడదు. వారిని భయానికి గురిచేయకూడదు. అలాగే వారిని తక్కువచేసి మాట్లాడకూడదు.
చిన్నారి: అంటే LKG పిల్లకి 10వ తరగతి పుస్తకం ఇస్తే ఏమవుతుందో అదే కదా?
బాలు: సరిగ్గా అదే చిన్నారి! కాబట్టి శ్రీకృష్ణుడు చెప్తాడు — ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి తగినంతగా నేర్పాలి.
గౌరవం లేనివాడికి చెప్పొద్దు
చిన్నారి: గురువుగారు ఇంకేం నేర్పించారు?
బాలు: శ్రీకృష్ణుడు భగవద్గీత 18వ అధ్యాయంలో ఇలా అంటాడు —
“ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన ।
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ॥18.67॥”
దీని అర్థం ఏమిటంటే: గౌరవం లేని వాళ్లకి, ఆసక్తి లేని వాళ్లకి, మనసు తెరచి వినని వాళ్లకి పవిత్రమైన బోధలు చెప్పడం వ్యర్థము.
చిన్నారి: ఎందుకంటే వాళ్లు విలువ అర్థం చేసుకోరా?
బాలు: అవును. వెలుగుతున్న దీపాన్ని గాలిలో పెట్టం కదా? దీపాన్ని కాపాడాలి. అలాగే జ్ఞానం కూడా కాపాడాలి.
నిజమైన విద్యార్థులకు చెప్పడం మహా పుణ్యం
చిన్నారి: అయితే ఎవరికీ చెప్పాలి?
బాలు: అక్కడే శ్రీకృష్ణుడి అసలు బోధ వస్తుంది —
“య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి ।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ॥ 18. 68 ॥
న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః ।
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి ॥ 18. 69 ॥”
దీని అర్థం ఏమిటంటే: ఎవరైతే ప్రేమగా, భక్తితో, నిజాయితీగా నేర్చుకోవాలనుకునే వారికి దివ్యజ్ఞానం బోధిస్తారో…అలాంటి భక్తుడు శ్రీకృష్ణుడికి ఈ లోకంలో అత్యంత ప్రియుడు!
చిన్నారి (ఆశ్చర్యంగా): అంటే జ్ఞానం పంచడం శ్రీకృష్ణుడికి చేసే పెద్ద సేవ అన్నమాటా?
బాలు: అవును చిన్నారి! సరైనవారికి… సరైన సమయంలో… ప్రేమతో పంచితే అది శ్రీకృష్ణుడి ప్రియమైన పనుల్లో ఒకటి.
ముగింపు
చిన్నారి: అంటే మూడు బోధలు —
1. సిద్ధం కానివాళ్లకి చెప్పి గందరగోళానికి గురిచేయవద్దు
2. గౌరవం లేనివాళ్లకి చెప్పవద్దు
3. నిజమైన విద్యార్థులకు దివ్యసందేశాన్ని చెప్పడం గొప్ప పుణ్యంతో కూడిన మన బాధ్యత.
బాలు: అవును! ఇలా జ్ఞానం రక్షింపబడుతూ…ప్రేమగా పంచబడుతూ…ధర్మం పుష్పంలా వికసిస్తుంది.
ఇద్దరూ కలిసి: “జై శ్రీకృష్ణ!”
ఆలోచన: హిందూమిత్ర మల్లాది శ్రీనివాస శాస్త్రి




Comments