శ్రీమద్ భాగవత భక్తిరసం
- Srinivasa Malladi
- Oct 29
- 2 min read
Updated: 5 days ago
పిల్లలూ! నారద మహర్షి మనందరికీ తెలుసును కదా? ఆయన ఎప్పుడూ భక్తిలో మునిగి "నారాయణ నారాయణ" అని జపిస్తూ తనచేతిలో వీణను మీటుతూ ప్రపంచంలో ఎక్కడికైనా చటుక్కున వెళ్లిపోగలడు. ఆయనకు పరమాత్మా పట్ల అపారమైన ప్రేమ.

మీకొక విషయం తెలుసా? మన భూమి ఎన్నోలక్షల సంవత్సరాల నుండి ఉంది. భూమిలాగే విశ్వంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా పుట్టి లక్షల సంవత్సరాలు అయ్యింది. మరి పుట్టాయి అంటే అంతకముందు లేవనే కదా అర్థం? అవును. మరి మనం చుట్టుపక్కల చూస్తే ప్రతీది పుడుతుంది, కొంతకాలం జీవిస్తుంది ఆ తరువాత మరణిస్తుంది. ఇలా పుట్టిన అన్నీ కూడా అనేక మార్లు పుట్టి, జీవించి, మరణిస్తూ ఉంటాయి. సృష్టికూడా అంతే.
సృష్టి (పుట్టుక) , స్థితి (జీవించడం), లయ (మరణించడం) అనేవి నక్షత్రాలకు, గ్రహాలకు కూడా ఉంటాయి. అయితే ఇవి లక్షల సంవత్సరాలు జీవిస్తాయి. ఇలాంటి ఒక చక్రాన్ని కల్పము అంటారు. అయితే నారద మహర్షి ఈ కాల్పనికన్నా ముందర కల్పంలో ఒక చిన్ని 5 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు ఏమైందో తెలుసా?
గురువులు ఉపదేశించాక ఆ అయిదేళ్ల బాలుడు అరణ్యానికి వెళ్లి చక్కగా నిర్మలమైన మనస్సుతో ఏమి కోరికలు లేకుండా కేవలం పరమాత్మ పై ధ్యానం చేసాడు. ఆ ధ్యానం చేసినప్పుడు అతనికి భగవంతునిపై అపారప్రేమ పుట్టి అంతటా పరమాత్మనే చూసాడు. "నేను వేరు, ఈ చెట్టు వేరు, ఆ కుందేలు వేరు, భగవంతుడు వేరు" అని ఏ మాత్రం అనిపించకుండా అంతా ఒక్కటిగా అనిపించింది.

నారద మహర్షి ఈ విషయం వ్యాస మహర్షికి చెప్తూన్న ఈ శ్రీమద్ భాగవతం శ్లోకం ఇప్పుడు పాడుకుందామా?
ప్రేమాతిభర నిర్భిన్న పులకాంగోఽతినిర్వృతః ।
ఆనంద సంప్లవే లీనో నాపశ్యం ఉభయం మునే ॥ १७ ॥
ఓ వ్యాసమహర్షి! నా హృదయం భగవంతుని ప్రేమతో నిండిపోవడం చేత, నా శరీరం అంతా పులకించింది.ఆ పరమానందభక్తిలో లీనమై నేను, భగవంతుడూ వేర్వేరు అన్న భావనను కోల్పోయి, ఏకత్వము, అనగా అంతా ఒక్కటే. వేరు వేరు కాదు, అనే ఆనందం పొందాను.
సనాతన ధర్మ ధ్యేయం ఇదే — ప్రేమను పెంపొందించుకోవడం.
ఆ ప్రేమ ద్వారా “నేనెవరు, నువ్వెవరు” అనే భేదభావం చెదిరిపోతుంది; ఏకాత్మతను పొంది తారసపడే స్థితి — అదే మోక్షం. తారతమ్యాలు, భేదాలు, ద్వేషాలు లేకుండా వ్యవహరించగలుగుతాము.. మన హృదయంలో ఉద్భవించే ఆ దైవప్రేమనే సమాజంలో ప్రదర్శించినప్పుడు, మన దృష్టి సమదృష్టిగా మారుతుంది. నేను ప్రేమను కేవలం దేవునిపై దారపోస్తాను కానీ మనుష్యులలో భేదాలు చూస్తాను అంటే సనాతన ధర్మాన్ని ఏమాత్రం అర్థంచేసుకోలేదని భావించాలి. అందుకే భగవద్గీతలో భగవంతుడు జ్ఞానం విజ్ఞాన సహితం అంటాడు. అంటే, పుస్తకజ్ఞానం మాత్రమే నిజమైన జ్ఞానం కాదు; అది ఆచరణయోగ్యమై ఉండాలి, సత్యమై ఉండాలి, జీవితంలో ప్రతిఫలించాలి. ఆచరణలో పెట్టిన తర్వాతే — ఆ జ్ఞానం నీకు సత్యంగా అనుభూతమవుతుంది, “నేను కనుగొన్న సత్యం ఇదే” అని చెప్పగలగుతావు.
పిల్లలు! ఇప్పుడు మీరు కూడా ఆ చిన్ని బాలుడిలా కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటూ వదులుతూ మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా ధ్యానం చేయండి. చేస్తూ "ఓం నమో నారాయణాయ! ఓం నమో నారాయణాయ!" అని గానీ "ఓం నమో భగవతే వాసుదేవాయ! ఓం నమో భగవతే వాసుదేవాయ!" అని మనసులో గానీ బయటకు గానీ చెప్పుకుంటూ రోజూ 10 నిమిషాలు ధ్యానం చేయండి.
Quiz:
1. నారద మహర్షి ఈ కల్పము మరియు పూర్వ కల్పములో ఉన్నాడు కదా, మరి కల్పము అంటే ఏమిటి?
2. సమదృష్టి అంటే ఏమిటి?
3. "జ్ఞానం విజ్ఞాన సహితం" అని ఏ గ్రంథంలో చెప్పబడింది? దాని అర్థం ఏమిటి?
4. ఈ కథనుండి ఏమి తెలుసుకున్నావు? నువ్వు కొన్ని వాక్యాలలో వ్రాసి మీ అమ్మానాన్నకి వివరించి చెప్పు.
ఓం నమో నారాయణాయ! ఓం నమో భగవతే వాసుదేవాయ!
రచన: హిందూమిత్ర Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి




Comments