శివునితో చిన్నారి రాజు స్నేహం
- Srinivasa Malladi
- Nov 26, 2025
- 2 min read
Updated: Nov 28, 2025

ఒక పల్లెటూరిలో రాజు అనే బాలుడు ఉండేవాడు. ఆడుకోవడం, చెట్టెక్కడం, మామిడిపండ్లు తినడం—ఇవి అతని రోజువారీ పనులు. రాజు ఒంటరిగా ఆడుకుంటున్నా లేక సమస్యలు చెప్పుకోవాలన్నా పరమశివునితో స్నేహితుడిలా మాట్లాడేవాడు. ప్రతి రాత్రీ పడుకున్నాక మెల్లిగా — “శివయ్య… నువ్వు వింటున్నావా?” అని అడిగేవాడు.
ఒకసారి పరీక్ష ఉందని రాజు పాఠాలు చదవాలి. కానీ రాజు పగలంతా సీతాకోకచిలుకల వెనకే పరిగెత్తాడు! రాత్రి ఆందోళనలో పడిపోయాడు. అప్పుడు రాజు ఇలా ప్రాధేయపడ్డాడు. “శివయ్యా! దయచేసి రేపు పరీక్షలో నాకు సులభమైన ప్రశ్నలు వచ్చేలా చూడు! సరేనా” అని అడిగాడు.
దీనిని గౌణభక్తి అంటారు. అనగా మన కష్టాలను తీర్చమని, కోరికలు తీర్చమని చేసే ప్రార్థన.
మరుసటి రోజు ఆశ్చర్యమేమిటంటే, ప్రశ్నలంతా నిజంగానే సులభంగా వచ్చాయి. రాజు గుప్పుమనుకొని నవ్వాడు—“ధన్యవాదాలు శివయ్యా!” అని మురిసిపోయాడు.
కొన్ని రోజులకే మరో ఘటన. బట్టలు బయట ఆరబెట్టాడు. ఆకస్మికంగా వర్షం మొదలైంది. ఆందోళనతో బయటికి పరుగెత్తుతూ—“శివయ్యా! వర్షం ఆపవా! బట్టలు తడుస్తాయి!” అని అడిగాడు. వాన మెల్లగా తగ్గి, ఆగిపోయింది. రాజు మళ్లీ చిరునవ్వుతో “శివయ్య నా మాట వింటున్నాడు!”
ఇది కూడా గౌణభక్తే—అవసరంలో చేసే దేవుడి జ్ఞాపకం.
ఒక రోజు తెల్లవారుజామున రాజు త్వరగా లేచాడు. పిట్టలు కుహుకుహూమని, సూర్యుడు బయటకు తొంగిచూసే చల్లని ఉదయం. రాజు కిటికీ దగ్గర నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ రోజు అతనికి ఏమీ కావాలన్న కోరిక లేదు. కేవలం మనసంతా ప్రశాంతతతో నిండిపోయింది. ఆ ప్రశాంతతలో మెల్లగా అన్నాడు— “శివయ్య… ఈరోజు నాకు ఏమీ వద్దు. నీతో కూర్చునే ఆనందమే చాలూ.” అతని గుండె వెచ్చగా, వెలుగులా అనిపించింది.
ఒక మృదువైన లోపలి స్వరం చెప్పినట్టు అనిపించింది— “రాజు! నా చిన్ని తండ్రి!… నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు.”
రాజు ఆనందబాష్పాలతో "శివయ్యా! ఎప్పుడూ నేను నిన్ను కోరడమే కానీ, నువ్వు ఎప్పుడూ ఏమి కోరవు. నీకు నామీద ఎంత ప్రేమో నాకు కూడా నీమీద అంతే ప్రేమ. నువ్వు బాగున్నావు కదా?" అంటూ తాను వేరు పరమశివుడు వేరు అనే భేదం లేని అద్భుతమైన ఏకత్వాన్ని చూసాడు..
ఆ రోజు నుంచి అతని ప్రార్థనల్లో చిన్న మార్పు వచ్చింది. అవసరం ఉన్నప్పుడు సహాయం అడిగినప్పటికీ ప్రతిరోజూ ఇలా కూడా చెప్పేవాడు— “శివయ్యా!… నాకోసం ఉన్నందుకు ధన్యవాదాలు.”
ఇదే పరాభక్తి—ఎటువంటి కోరికలు లేకుండా, భగవతునితో పట్ల నిస్వార్థ ప్రేమను పంచుకోవడం.
అప్పటినుండి రాజు గుండె చిన్న దీపంలా వెలుగుతూ ఉండేది. పరమశివుడు ప్రతిరోజు అతని స్నేహితుడిలా తోడుగా ఉన్నాడని రాజు అర్థం చేసుకున్నాడు. రాజు తెలుసుకున్నట్లుగానే మనం పాటించాల్సినది పరాభక్తి. గౌణభక్తి కేవలం పరాభక్తిని చేరుటకు తొలిమెట్లు మాత్రమే. ఆ తొలిమెట్లలోనే మనం ఆగిపోకూడదు. పరాభక్తిని చేరి భగవంతునితో స్నేహపూర్వకంగా భక్తిలో లీనమవ్వాలి.
ఆలోచన: హిందూమిత్ర మల్లాది శ్రీనివాస శాస్త్రి




Comments