పరహితమే పరమ ధర్మము
- Srinivasa Malladi
- Mar 31
- 1 min read
స్వార్థాన్ని త్యజించి, లోకాల మేలుకోసం చేసిన కార్యమే నిజమైన శివతత్త్వం.

సాగరమథనం జరుగుతున్న సమయంలో, సురులు–అసురులు కలిసి వాసుకి అనే సర్పాన్ని కవ్వపుత్రాడుగా, మందరపర్వతాన్ని కవ్వముగా ఉపయోగించి పాలసముద్రాన్ని మథించారు. ఆ మథన ప్రక్రియలో వాసుకి నోటినుండి “హాలాహలం” అనే భయంకరమైన గరళం వెలువడింది. ఆ విషం సముద్రంలో వ్యాపించడంతో సర్వప్రాణులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అగ్నిలా దహించుతూ, సెగలతో చుట్టుముట్టిన ఆ హాలాహలాన్ని చూసి సురులు, అసురులు భయభ్రాంతులతో పరుగులు తీశారు.
దిక్కుతోచని బ్రహ్మాదిదేవతలు శివుని శరణు చేరి ప్రార్థించారు:“ఓ త్రినేత్రా! నీవే పంచభూతాల స్వరూపి. త్రిమూర్తులకు, త్రిజగత్తులకు, త్రికాలాలకు మూలమైన పరమేశ్వరుడవు. ప్రభూ! మమ్మల్ని రక్షించు.”
వారి ప్రార్థన విని, శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు:“భవానీ! పరహితమే పరమ ధర్మము. లోకాల రక్షణ కోసం ఈ హాలాహలాన్ని నేను ఆరగిస్తాను.” అప్పుడు పార్వతీదేవి ప్రశాంతంగా స్పందించింది:“స్వామీ! మీకు అనుకూలమైన విధంగా లోకకల్యాణం చేయండి.”
ఈ మహత్తర సన్నివేశాన్ని పోతన భాగవతంలో ఎంతో సుగమంగా, భావపూర్ణంగా ఇలా వర్ణించారు:
మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలనిప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ మంగళ సూత్రంబు నెంతమది నమ్మినదో
అంటే, మ్రింగవలసినది హాలాహలమనే గరళమని తెలిసి, దాన్ని మ్రింగబోయేది తన భర్త పరమేశ్వరుడే అని తెలిసినా, లోకాల మేలుకోసం ఆ త్యాగాన్ని సమ్మతించినది సర్వమంగళ అయిన పార్వతీదేవి. తన మాంగల్యబలంపై అపారమైన విశ్వాసంతో, తనకు సంభవించగల ప్రమాదాన్ని లెక్కచేయకుండా, జగత్తు శ్రేయస్సును ముందుంచి ఆమోదించింది.
అందువల్లే ఆమె “సర్వమంగళ” అనే నామానికి సార్థకత పొందింది.
పరహితమే పరమ ధర్మము — పరుల మేలుకోసం చేసిన త్యాగమే నిజమైన దైవత్వం.
కథను చదివిన తర్వాత, ఈ ప్రశ్నలకు జవాబులు వ్రాయండి :
శివుడు ఏమి చేశాడు? ఎందుకు చేశాడు?
పార్వతీదేవి ఎందుకు అంగీకరించింది?
“పరహితమే పరమ ధర్మము” అంటే మీకు ఏమి అర్థమైంది?
మంచి పనుల జాబితా
ఈ వారం మీరు ఇతరులకు సహాయం చేసిన 3 పనులు వ్రాయండి.
చిత్రం గీయండి
“శివుడు లోకాల కోసం త్యాగం చేస్తున్న దృశ్యం” లేదా
“మీరు ఇతరులకు సహాయం చేస్తున్న దృశ్యం” గీయండి.
ఈ కథ హిందూబడి పాఠ్య పుస్తకంలో భాగం. రచన: హిందూమిత్ర Dr మల్లాది శ్రీనివాస శాస్త్రి




Comments