top of page
Search

ఆధునిక భారతపు మహాక్షత్రీయుడు - అల్లూరి సీతారామరాజు


చరిత్రలో కొన్ని పేర్లు కేవలం వ్యక్తులను సూచించవు. అవి ఒక భావజాలాన్ని, ఒక ఉద్యమాన్ని, ఒక జాతి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. అలాంటి అరుదైన పేర్లలో అల్లూరి సీతారామరాజు పేరు అగ్రస్థానంలో నిలుస్తుంది. భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలను అర్పించినప్పటికీ, గిరిజనుల హక్కులను దేశ స్వాతంత్ర్య లక్ష్యంతో ముడిపెట్టి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అరణ్య ప్రాంతాల్లో సవాలు చేసిన నాయకుడిగా అల్లూరి సీతారామరాజు ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.


అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం

విమానాశ్రయం అనేది ఒక ప్రాంతానికి ముఖద్వారం. ప్రపంచం నుండి వచ్చే ప్రతి ప్రయాణికుడు మొదట చూసేది ఆ పేరు. నేడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలవబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, చరిత్రకు సమర్పించిన వందనం. త్యాగానికి ఇచ్చిన గౌరవం. భవిష్యత్ తరాలకు అందించిన స్ఫూర్తి.



“అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” అనే పేరు చూసినప్పుడు ప్రపంచం ఒక ప్రశ్న అడుగుతుంది — అల్లూరి ఎవరు?


మన్యం వీరుడు

అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న జన్మించారు. బాల్యంలోనే ఆయనలో అసాధారణమైన చైతన్యం కనిపించింది. పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా ప్రజల మధ్య జీవిస్తూ వారి కష్టాలను అర్థం చేసుకోవాలని ఆయన భావించారు. దేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించిన ఆయన చివరకు తూర్పు కనుమల గిరిజన ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడ ఆయన చూసింది కేవలం పేదరికం కాదు; ఒక సమాజం ఎదుర్కొంటున్న అన్యాయం. శతాబ్దాలుగా అడవులను ఆధారంగా చేసుకొని జీవిస్తున్న గిరిజనులను బ్రిటిష్ అటవీ చట్టాలు వారి సొంత నేలలోనే పరాయివారిగా మార్చుతున్నాయి. వారి జీవన విధానంపై ఆంక్షలు విధించబడుతున్నాయి. బలవంతపు కూలీ పనులు చేయిస్తున్నారు. వారి గౌరవం దెబ్బతింటోంది. ఈ పరిస్థితులను చూసిన అల్లూరి మౌనంగా ఉండలేకపోయారు. ఆయన పోరాటం రాజకీయ అధికారాన్ని పొందడానికి కాదు; న్యాయం కోసం-ప్రజల హక్కుల కోసం-స్వాభిమానం కోసం.


1922లో ప్రారంభమైన రంపా తిరుగుబాటు భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. అహింసా ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో అరణ్య ప్రాంతాల్లో అల్లూరి నాయకత్వంలో ఒక సాయుధ ఉద్యమం రూపుదిద్దుకుంది.


చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి వంటి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా బ్రిటిష్ పాలనకు ఆయన ప్రత్యక్ష సవాలు విసిరారు. ఆధునిక ఆయుధాలు, భారీ సైన్యం, అపార వనరులు కలిగిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని గిరిజన యువకులతో కలిసి ఎదిరించడం అసాధారణ ధైర్యానికి నిదర్శనం.


అయితే ఆయన పోరాటం హింసను ప్రోత్సహించడానికి కాదు. ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, స్వేచ్ఛ కోసం ప్రజలు ఎంత దూరమైనా వెళ్ళగలరని చాటిచెప్పడానికి.


అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడేటప్పుడు కేవలం విప్లవకారుడిగా చెప్పడం సరిపోదు. ఆయన ప్రజలతో మమేకమైన నాయకుడు. గిరిజనుల సమస్యలను తన సమస్యలుగా స్వీకరించిన వ్యక్తి. వారి భాష మాట్లాడాడు. వారి మధ్య జీవించాడు. వారి కష్టాలను అనుభవించాడు. అందుకే గిరిజనులు ఆయనను నాయకుడిగా మాత్రమే కాకుండా తమ రక్షకుడిగా భావించారు.


ఆయుర్వేద మరియు మూలికా వైద్య పరిజ్ఞానం

ఆయనకు ఉన్న ఆయుర్వేద పరిజ్ఞానం, మూలికల వైద్యంలో నైపుణ్యం, అసాధారణ వ్యూహరచన గిరిజనులను ఎంతో ఆకట్టుకున్నాయి. వారు ఆయనను దైవాంశసంభూతుడిగా భావించి అపారమైన విశ్వాసంతో అనుసరించారు.


1924 మే 7న బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజును పట్టుకొని కాల్చి చంపింది. ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలు. అయితే ఆయన మరణించలేదు. ఒక ఆలోచనగా జీవించారు. ఒక స్పూర్తిగా నిలిచారు. ఒక ఆదర్శంగా మారారు.


ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలు జాతీయ నాయకుల పేర్లను ధరిస్తున్నాయి. వారి కృషిని తరతరాలకు గుర్తుచేయడమే దాని ఉద్దేశ్యం.


అల్లూరి స్ఫూర్తికి శాశ్వత స్మారకం

ఈ విమానాశ్రయం ద్వారా లక్షలాది మంది ప్రయాణిస్తారు. వారిలో పిల్లలు ఉంటారు. యువత ఉంటుంది. విదేశీయులు ఉంటారు. విమానాశ్రయ పేరు వారిలో ఆసక్తిని కలిగిస్తుంది. వారు అల్లూరి గురించి తెలుసుకుంటారు. ఒక యువకుడు తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం ఎలా జీవించాడో తెలుసుకుంటారు. స్వేచ్ఛ విలువ ఏమిటో తెలుసుకుంటారు.


యవ్వన అగ్నిలో దేశాన్ని వెలిగించిన అల్లూరి సీతారామరాజు త్యాగానికి శాశ్వత స్మారకంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరే అత్యున్నత గౌరవం.


-దేవయాని అయ్యగారి

(వచనం)




 
 
 

Comments


Post: Blog2_Post

©2021 హిందూమిత్ర ద్వారా. Wix.comతో సగర్వంగా సృష్టించబడింది

bottom of page