చాతుర్వర్ణాలు – భగవంతుని షడ్గుణాల సామాజిక వ్యక్తీకరణ
- Srinivasa Malladi
- Jul 13
- 2 min read

భగవంతుని గురించి శాస్త్రాలు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తాయి. భగవంతుడు షడ్గుణ సంపూర్ణుడు. అంటే ఆయనలో జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు, శక్తి అనే ఆరు దివ్య గుణాలు అనంతంగా, సంపూర్ణంగా నిత్యంగా ఉన్నాయి. ఈ గుణాలన్నీ విడివిడిగా కాక, ఒకే పరమస్వరూపంలో ఏకమై ఉన్నాయి.
అదే సమయంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు,
"చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః" (భగవద్గీత 4.13)
అని ప్రకటించాడు. అంటే సమాజంలో వర్ణవ్యవస్థ జన్మ ఆధారంగా కాక, గుణాలు మరియు కర్మలు ఆధారంగా ఏర్పడిన సహజ వ్యవస్థ అని అర్థం.
ఈ రెండు విషయాలను కలిపి పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన భావన కనిపిస్తుంది. భగవంతునిలో ఏకరూపంగా ఉన్న షడ్గుణాలు, సమాజంలో చాతుర్వర్ణాల ద్వారా ప్రధానంగా వ్యక్తమవుతూ సమాజాన్ని సమగ్రంగా నడిపిస్తాయి.
స్వభావం ప్రకారం బ్రాహ్మణ వర్ణం ఎన్నుకున్నవాడు ప్రధానంగా జ్ఞానం మరియు తేజస్సు అనే గుణాలను కలిగి ఉండాలి.
జ్ఞానాన్ని సంపాదించడం, సంరక్షించడం, బోధించడం,
ధర్మాన్ని నిలబెట్టడం,
తపస్సు మరియు బ్రహ్మవర్చస్సుతో సమాజానికి దిశానిర్దేశం చేయడం అతని ప్రధాన బాధ్యత. జ్ఞానం లేకుండా సమాజానికి దిశ ఉండదు. అందువల్ల బ్రాహ్మణుడు సమాజానికి జ్ఞానదీపంలా నిలుస్తాడు.
స్వభావం ప్రకారం క్షత్రియ వర్ణం ఎన్నుకున్నవాడు ప్రధానంగా వీర్యం, తేజస్సు మరియు రక్షణాత్మక బలం కలిగి ఉంటాడు.
ధర్మాన్ని రక్షించడం, ప్రజలకు భద్రత కల్పించడం,
ధైర్యంతో నాయకత్వం వహించడం,
అవసరమైతే త్యాగం చేయడం అతని కర్తవ్యం. సమాజానికి రక్షణ లేకపోతే ధర్మమూ, జ్ఞానమూ, సంపదయూ నిలవవు.
స్వభావం ప్రకారం వైశ్య వర్ణం ఎన్నుకున్నవాడు ప్రధానంగా ఐశ్వర్యం అనే దివ్యగుణాన్ని వ్యక్తపరుస్తాడు.
వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం, పరిశ్రమల ద్వారా సంపదను సృష్టించి సమాజాన్ని పోషిస్తాడు.
వనరులను సమర్థంగా వినియోగించి అందరి అభ్యున్నతికి తోడ్పడతాడు. ఐశ్వర్యం అనేది కేవలం ధనం కాదు; సమాజాన్ని పోషించే సామర్థ్యం.
స్వభావం ప్రకారం శూద్ర వర్ణం ఎన్నుకున్నవాడు ప్రధానంగా శక్తి మరియు ఉత్పాదక బలం వ్యక్తపరుస్తాడు.
నైపుణ్యం, శ్రమ, సహనం, కార్యదీక్ష, నిర్మాణశక్తి—ఇవన్నీ అతని విశిష్ట లక్షణాలు.
మిగిలిన వర్ణాల ఆలోచనలు, ప్రణాళికలు, వనరులు అన్నీ కార్యరూపం దాల్చేది శూద్రుని శ్రమ ద్వారానే.
అతని చేతుల ద్వారానే నాగరికత నిర్మితమవుతుంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. బలం అనే గుణం కేవలం క్షత్రియునికే పరిమితం కాదు. క్షత్రియునిలో అది రక్షణాత్మక బలంగా వ్యక్తమవుతుంది. శత్రువును ఎదుర్కొనే ధైర్యం, ప్రజలను రక్షించే సామర్థ్యం, నాయకత్వం అతని బలం. అదే శూద్రునిలో బలం ఉత్పాదక శక్తిగా వ్యక్తమవుతుంది. శ్రమించగల శక్తి, సహనశక్తి, నైపుణ్యం, నిర్మాణ సామర్థ్యం, నిరంతర కృషి—ఇవి సమాజాభివృద్ధికి పునాది.
ఈ దృష్టితో చూస్తే సమాజంలో సంపదను సృష్టించేది కేవలం ధనం కాదు. జ్ఞానం దిశను చూపుతుంది. ధైర్యం రక్షణ కల్పిస్తుంది. ఐశ్వర్యం వనరులను సమీకరిస్తుంది. శక్తి మరియు ఉత్పాదక బలం వాటిని కార్యరూపంలోకి తీసుకువస్తాయి. ఈ నాలుగు పరస్పరం సహకరించినప్పుడే సమాజం సుసంపన్నంగా, స్థిరంగా, ధార్మికంగా ఎదుగుతుంది.
వర్ణవ్యవస్థ సూత్రం మానవ సమాజమంతటా ప్రతిబింబిస్తుంది. వాణిజ్యం, వైద్యరంగం, స్వచ్ఛంద సేవా సంస్థలు, రక్షణ దళాలు, ప్రభుత్వ వ్యవస్థలు—ఏ విజయవంతమైన సంస్థనైనా పరిశీలించినా, భిన్నమైన కానీ పరస్పర పరిపూరకమైన బాధ్యతలను నిర్వర్తించే వ్యక్తులపై అది ఆధారపడి ఉంటుంది. ఈ పాత్రలన్నింటినీ ఉన్నత–నిమ్న భావనలతో కాక, పరస్పర గౌరవం మరియు విలువతో చూసినప్పుడు సమాజం దృఢంగా, స్థిరంగా ఎదిగి నిరంతర ప్రగతిని సాధిస్తుంది.

అందువల్ల చాతుర్వర్ణాలను ఉన్నత–హీన భావనతో చూడకూడదు. అవి భగవంతుని దివ్యగుణాల విభిన్న సామాజిక వ్యక్తీకరణలు. కించపరిస్తే భగవంతుని దివ్యగుణాలను కించపరిచినట్లే. శరీరంలో తల, భుజాలు, ఉదరం, పాదాలు అన్నీ అవసరమైనట్లే, సమాజంలో జ్ఞానం, రక్షణ, సంపదసృష్టి, కార్యసిద్ధి అన్నీ సమానంగా అవసరం. అవమానిస్తే విరాట్స్వరూపుని అవయవాలను అవమానించినట్లే. ఒకటి లేకపోతే మరొకటి సంపూర్ణంగా పనిచేయదు.
కాబట్టి చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క అసలు సందేశం
విభజన కాదు—పరస్పరపూరకత.
ఆధిపత్యం కాదు—సహకారం.
జన్మ కాదు—గుణం మరియు కర్మ.
ఎలా అయితే షడ్గుణాలలో ఏ ఒకటి లోపించినా పరిపూర్ణమైన దివ్యత్వం ఉండదో అలాగే ఏ వర్ణం లోపించినా దివ్యత్వం పరిపూర్ణం కాదు. నాలుగు వర్ణాలను సమదృష్టితో ఒకటిగా గౌరవించడంలోనే సమానత్వం మరియూ దివ్యత్వం. నాలుగు వర్ణాలు కలసి కృషి చేస్తేనే సామాజిక పరిపూర్ణత.
భగవంతుని షడ్గుణాలు సమాజంలో ఈ విధంగా వికసించినప్పుడు మాత్రమే నిజమైన ధర్మరాజ్యం ఏర్పడుతుంది.
ఒకే పరమాత్మ.
ఆరు దివ్యగుణాలు.
నాలుగు పరస్పరపూరక వ్యక్తీకరణలు.
ఒక సామరస్యపూర్ణ, సుసంపన్న సమాజం.
రచన: హిందూమిత్ర డా. మల్లాది శ్రీనివాస శాస్త్రి




Comments